Reading Time: 2 minutes

ఈ సారి శ్రీ పంచముఖ సంకటహార మహా గణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్

Caption of Image.

ఖైరతాబాద్ బడా గణేశుడు 72వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ ఏటి ఉత్సవాలకు సంబంధించి అత్యంత కీలకమైన తొలి ఘట్టం ఘనంగా ఆవిష్కృతమైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణానికి భక్తిశ్రద్ధల మధ్య కర్ర పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయింది.

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా వేడుక కనులపండువగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి  ప్రత్యేకంగా తీసుకొచ్చిన పసుపు, కుంకుమలతో.. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ వేదపండితులు ఈ కర్ర పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ మహా ఘట్టంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ , సికింద్రాబాద్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, ఉత్సవ సమితి సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రముఖులు, భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఇక కర్ర పూజ అనంతరం.. ఈ ఏడాది భక్తులకు దర్శనమివ్వబోయే స్వామివారి నమూనా పోస్టర్‌ను ప్రముఖ శిల్పి రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్  విడుదల చేశారు. ఈసారి ఖైరతాబాద్ బడా గణేశుడు శ్రీ పంచముఖ సంకటహార మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చి, సకల సంకటాలను దూరం చేయనున్నాడు.

సెప్టెంబర్ 14న వినాయక చవితి పర్వదినం కాగా.. ఈ కర్ర పూజ నాటి నుండి సరిగ్గా 80 రోజుల వ్యవధి ఉంది. ఈ 80 రోజుల్లోనే శిల్పి రాజేందర్ బృందం రాత్రింబవళ్లు శ్రమించి.. ఆ శరణు గణేషుడి విరాట్ రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనుంది. లంబోదరుడి ఆగమనం కోసం.. ఆ పంచముఖ గణనాథుడి దివ్య రూప దర్శనం కోసం భాగ్యనగరంతో పాటు తెలుగు రాష్ట్రాల భక్తులు ఇప్పుడే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.