Reading Time: 2 minutes
Ketan Agarwal Case Siya Goyal Told Parents She Loved Ketan Before Marriage

పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ తల్లిదండ్రులు మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కుమార్తెకు చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం ఉందనే విషయం తమకు ఏ మాత్రం తెలియదని స్పష్టం చేశారు. కేతన్‌ అగర్వాల్‌తో పెళ్లి ఖరారు చేసే ముందు ఎన్నోసార్లు అడిగామని.. తాను కేతన్‌ను ఇష్టపడుతున్నానని.. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని సియా చెప్పిందని వెల్లడించారు.

ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన సియా తల్లి పూజా గోయల్.. పెళ్లి ఖరారు చేసే ముందు కనీసం పది సార్లు అయినా సియాను అడిగానని. కేతన్ నచ్చాడా? ఈ పెళ్లికి నీకు ఇష్టమేనా? అని ప్రశ్నించామని.. ప్రతిసారి ఆమె ‘అవును అమ్మా.. కేతన్ నచ్చాడు. నేను అతడినే పెళ్లి చేసుకుంటాను. నాకు మరెవరితోనూ సంబంధం లేదని చెప్పేది” అని పేర్కొన్నారు.

చేతన్ చౌదరితో సియాకు పరిచయం ఉందని.. క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఇద్దరూ కలుసుకున్నారని అంగీకరించిన పూజా గోయల్.. అయితే అది కేవలం స్నేహం మాత్రమేనని తమకు తెలుసని చెప్పారు. పెళ్లి చేసుకోవాలనిపించకపోయినా లేదా మరెవరినైనా ప్రేమిస్తున్నా సియా తమతో చెప్పి ఉండేదని.. అలాంటి సంకేతాలు ఎప్పుడూ కనిపించలేదని తెలిపారు.

సియా తండ్రి ప్రవీణ్ గోయల్ వివరాల ప్రకారం.. గోవాలో జరిగిన ఓ కుటుంబ వివాహ వేడుకలో కేతన్ కుటుంబ సభ్యులు మొదట సియాను కోడలిగా చేసుకోవాలని ఆసక్తి చూపారు. అయితే ఆ సమయంలో సియా వయసు కేవలం 19 ఏళ్లు కావడంతో పెళ్లి విషయాన్ని వాయిదా వేశారు. తర్వాత మరో కుటుంబ వేడుకలో ఈ ప్రతిపాదన మళ్లీ ముందుకు వచ్చింది. అగర్వాల్ కుటుంబం మంచి పేరు ప్రతిష్ఠలు కలిగిన కుటుంబమని బంధువులు చెప్పడంతో పెళ్లి చర్చలను ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా సియా, కేతన్ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నట్లు కనిపించలేదని చెప్పారు. ఇద్దరూ తరచూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకునేవారని.. కేతన్ తమ ఇంటికి వచ్చి భోజనం కూడా చేశాడని తెలిపారు. వివాహం అనంతరం బాలి పర్యటనకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. సియా కోసం దాదాపు రూ.50 వేల విలువైన షాపింగ్ కూడా చేసినట్లు వెల్లడించారు. ఒకవేళ సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే.. మేమెందుకు ఇన్ని ఏర్పాట్లు చేసేవాళ్లం?” అని ఆమె తల్లి ప్రశ్నించారు.

ట్రెక్కింగ్ ప్లాన్ కేతన్‌దే


లోహగడ్ కోట ట్రెక్కింగ్‌కు వెళ్లాలన్న ఆలోచన కేతన్‌దేనని సియా తల్లిదండ్రులు చెప్పారు. తమ కుమార్తె మొదట వెళ్లడానికి ఆసక్తి చూపలేదని, మరుసటి రోజు మహాబలేశ్వర్ వెళ్లే ప్లాన్ ఉందని చెప్పిందని పేర్కొన్నారు. “సియా నాతో కేతన్ ట్రెక్కింగ్‌కు రమ్మంటున్నాడు.. కానీ నాకు వెళ్లాలని లేదు’ అని చెప్పింది. అయితే కేతన్ తల్లి ‘అతను ఏదైనా బర్త్‌డే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసి ఉండొచ్చు.. వెళ్లిపో అని చెప్పడంతో వెళ్లింది” అని పూజా గోయల్ తెలిపారు.

తన కుమార్తె హత్య కేసులో అరెస్టయిందనే విషయం తెలిసి తీవ్ర షాక్‌కు గురయ్యానని ప్రవీణ్ గోయల్ తెలిపారు. “నా కూతురు ఇలాంటి పని చేస్తుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఎప్పుడూ సరైన మార్గంలోనే నడిచింది” అని అన్నారు. అయితే ఒకవేళ కోర్టులో ఆరోపణలు నిజమని తేలితే ఆమెకు కఠినమైన శిక్ష విధించాలన్నారు.