Reading Time: < 1 minute
Ketan Agarwal Murder Case Security Guard Reveals Siya Goyals First Words After Killing

Ketan Agarwal case: దేశవ్యాప్తంగా పూణేకు చెందిన కేతన్ అగర్వార్ హత్య కేసు సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్య చేశారు. పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు ట్రెక్కింగ్ కోసం వెళ్దామని చెప్పి, ఆ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. జూన్ 18న కేతన్‌ను ప్లాన్ ప్రకారం హత్య చేసిన తర్వాత, సియా తన నోటి నుంచి తొలి అబద్ధాన్ని చెప్పింది. కోట వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ధీరజ్ జాధవ్ ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు.

హత్య తర్వాత, తాను కేకలు విని పరిగెత్తుకుంటూ వెళ్లానని, అక్కడ సియా గోయల్‌ను ఏం జరిగిందని ప్రశ్నించినట్లు జాధవ్ చెప్పారు. దీనికి సియా ‘‘ఇక్కడి నుంచి ఎవరో కిందపడిపోయారు’’ అని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కేతన్‌‌ను లోయలోకి తోసేసిన తర్వాత ‘‘హెల్ప్.. హెల్ప్..’’ అంటూ అరిచినట్లు గార్డు చెప్పారు. అయితే, ఆ సమయంలో మరే వివరాలు చెప్పలేదని, తాను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని వెల్లడించారు.

ఈ కేసులో సియా గోయల్(20), చేతన్ చౌదరి(22)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి కేతన్‌ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు రోజు సియా, చేతన్ పూణేలోని ఒక కేఫేలో గంటల తరబడి హత్యకు పథకం రచించినట్లు వెల్లడైంది. కొన్ని నెలల వ్యవధిలో ఇద్దరి మధ్య ఏకంగా 2004 ఫోన్ కాల్స్ వెళ్లాయని, 238 గంటలకు పైగా మాట్లాడుకున్నారనే వివరాలు బయటకు వచ్చాయి. హత్యకు ముందు కూడా జూన్ 14న లోహ్‌గఢ్ కోట సందర్శన సమయంలో సియా కేతన్‌ను తోసేసింది. ఆ సమయంలో ఒక పొదను కేతన్ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. పాము కనిపించడంతో నిన్ను కాపడటానికే తోసేసినట్లు సియా చెప్పింది. ఆమె మాటలు నమ్మిన కేతన్ చివరకు జూన్ 18న కుట్రకు బలయ్యాడు.