Reading Time: < 1 minute

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఎంఎల్‌సి ఎల్.రమణతో కలిసి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై ఆయనకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో అక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించారు.

రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి

2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని కెటిఆర్ తెలిపారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో ఈ బిల్లుల భారాన్ని రద్దు చేసి నేతన్నను అదుకోవాలని కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని, కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలిపారు.