Reading Time: 4 minutes

వరి సాగుతోనే సమస్యలు పరిష్కారం కావు

రైతులు వాణిజ్య పంటల వైపు మళ్లాలి

 నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు ఇబ్బందులున్నా రైతు

సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అన్ని గ్రామాలు అంకాపూర్‌లా

మారాలి ప్రతి నెలా రైతాంగంపై రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం

రూ.9వేల కోట్ల రైతుభరోసా నిధులు 45రోజుల్లో ఖాతాల్లో వేస్తాం

కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్షం ఏ

నియోజకవర్గంపైనా వివక్ష లేదు.. అన్నీ సమానమే యుద్ధం నేపథ్యంలో

యూరియా కొరత తలెత్తే అవకాశం రామగుండంలో ఉత్పత్తి

అవుతున్నదంతా తెలంగాణకే కేటాయించాలి ఎన్నికలు వచ్చినప్పుడే

రాజకీయాలు చేద్దాం కొడంగల్‌లోనూ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి సూచన

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రైతును రా జుగా చేసేంతవరకు విశ్రమించేది లేదని, వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మె ట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించా రు. 114 నెలల కేసీఆర్ పాలనలో రైతుల కోసం సుమారు రూ.2533 కోట్లు ఖర్చు చేస్తే, ప్రజా పాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 28 నెలల్లో రూ.5500 కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని స్ప ష్టం చేశారు. వ్యవసాయ రంగంలో మార్పు రా వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొద టి స్థానంలో ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం సైతం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుందన్నారు. మిగతా ధాన్యం ఎగుమతి చేయలేక ఉండే పరిస్థితి నెలకొందన్నారు .అయినా రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. వరి పంట సాగు ఒక్కటే మన సమస్యలకు పరిష్కారం కాదని పంటల మార్పు జరిగితే ఇంకా ఎంతో లాభాలు వస్తాయన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని దీన్ని కాస్త పది లక్షల ఎకరాల్లో సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే మిల్లెట్స్‌తో పాటు రకరకాల పండ్ల సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పంటలు మన రాష్ట్రంలో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. పంట మార్పిడి చేసిన రైతులకు ప్రభుత్వపరంగా అన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు.

పంట మార్పిడి చేస్తే నష్టం వాటిల్లుతుందన్న అపోహ వీడాలన్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయాన రైతు అని అందుకే ఆయనకు రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి లాభసాటి వ్యవసాయంపై ఆలోచనలు చేద్దామన్నారు. వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే మరో రూపాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చి రైతులకు లాభం చేస్తామన్నారు. సిద్దిపేట నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తరహాలో కొడంగల్ లో సైతం నిర్మించే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు అమాయకులని ఇప్పుడిప్పుడే మా ప్రాంతాన్నీ అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ అన్ని రకాల సాగుకు అనుకూలమన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు 45 రోజుల్లో 9,000 కోట్ల డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత 3600 కోట్ల రూపాయల నిధులను సిద్దిపేట గడ్డ నుంచే విడుదల చేశామన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే భూ నిర్వాసితులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఇలా కాకుండా తన కొడంగల్ నియోజకవర్గంలోని భూ నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు పూర్తిస్థాయి పరిహారాన్ని చెల్లించి భూమిని సేకరించామన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణ సమయంలో నిర్వాసితులకు న్యాయం జరగాలని తానే 48 గంటలు దీక్ష చేశానని గుర్తు చేశారు.

సిద్దిపేట నియోజకవర్గంపై ఎలాంటి వివక్ష లేదు..

సిద్దిపేట నియోజకవర్గంపై తాను వివక్ష చూపుతున్నానని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయంగా మా మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై వివక్ష లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలతో సమానంగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గం చూస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల తరహాలోనే ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు .2014 నుంచి 2024 వరకు బిఆర్‌ఎస్ హయాంలో కొడంగల్ కు అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో పూర్తి లెక్కలు తీద్దామా అని ప్రశ్నించారు. మీ తరహాలో నేను వివక్ష చూపలేనని అలాంటి తత్వం తనది కాదని స్పష్టం చేశారు.ఇన్ని సంవత్సరాలు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇచ్చారనీ 2029లో మా కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇచ్చి గెలిపించాలన్నారు.సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోనీ ప్రతి గ్రామం అంకాపూర్ల మారాలని ఆయన పేర్కొన్నారు. అంకాపూర్ గ్రామంలో అన్ని రకాల పంటలు సాగు చేస్తారనీ ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. అంకాపూర్ లా ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

కోటి మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం..

రాష్ట్రంలోని కోటి మహిళలను కోటేశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికీ స్వయం సహాయక సంఘాల్లోఇప్పటికీ 67 లక్షల మంది మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారని వీరి సంఖ్య కోటి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యమే కల్పించడమే కాకుండా వెయ్యి బస్సులకు యజమానులుగా మార్చామన్నారు. అలాగే పెట్రోల్ పంపు నిర్వహణ కూడా మహిళ సంఘాలకు అందించామన్నారు.ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ఉచిత బస్సు పథకాన్ని తీసుకువచ్చి లాభంలోకి తీసుకువచ్చామన్నారు. ఇప్పటికే ఉచిత ప్రయాణం కింద 9,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ మహిళలు అదాని,అంబానీలకు దీటుగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. మహిళల ప్రాతిపదికనా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అందులోని భాగంగా ఏ పథకం ప్రవేశపెట్టిన మహిళల పేరు మీదనే అందిస్తున్నామన్నారు. మహిళలందరూ ఆర్థికంగా స్వయం శక్తితో నిలబడాలన్నదే తన లక్ష్యమన్నారు. మహిళలందరికీ ఒక అన్నగా అహర్నిశలు శ్రమిస్తానని ఉద్గాటించారు.

రామగుండం యూరియా ఉత్పత్తి తెలంగాణకే కేటాయించాలి

రామగుండంలోని న్యూరో ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్ ,ఇజ్రాయిల్, అమెరికా మధ్యలో యుద్ధం జరుగుతుందన్న గ్యాస్ ,ఆయిల్ లాంటి సమస్యలు పెరగవచ్చు అన్నారు. ఇందులో భాగంగానే యూరియా సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నుంచి బిజెపి కేంద్ర మంత్రులతో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని మంత్రులంతా బృందంగా ఏర్పడి ఢిల్లీ వెళ్లి యూరియా అత్యధికంగా వచ్చేలా చర్చించాలన్నారు.

ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు..

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దామని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమ లక్ష్యంగా కలిసి పనిచేద్దామని అన్ని పార్టీలకు సూచించారు. దేశ ప్రధాని మోడీ అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి వస్తే తాను వెళ్తానని అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు.

పేద ప్రజలపై ముసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు

మూసి పేద ప్రజలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలపై ప్రతిపక్షం పగతో వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డం పడుకుంటామంటే ఆగేది లేదని వారిని దాటుకుంటా వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వం అని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు…

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని విద్యాలయాల్లో నర్సరీని ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులకు నిత్యం పాలు, రాగి జావా తో పాటు బ్రేక్ ఫాస్ట్ మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల మోజులో పడవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన, ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఏ టి సి సెంటర్లలో శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు రెండు వేల చొప్పున అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. కాలానికి అనుకూలంగా మార్పులు వస్తున్నాయన్నారు. కులాలకు అతీతంగా ఒకరి వృత్తి పనులను మరొకరు చేస్తూ అత్యధిక ఆదాయం పొందుతున్నారన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన రైతు మేళా స్టాళ్లను పరిశీలించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహ, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య యాదవ్,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణారావు, నవీన్ యాదవ్, తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ హైమావతి తో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులు,ప్రజలు పాల్గొన్నారు