
AP Schools Reopen Today: ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలలు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. విద్యార్థుల విద్యాభ్యాసం, ఉపాధ్యాయుల పనిభారం, పరీక్షల నిర్వహణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలు ఉండగా, 87 రోజులు సెలవులుగా ప్రకటించారు.
విద్యార్థుల అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తూ విద్యా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఉపాధ్యాయులు వారానికి 24 నుంచి 30 పీరియడ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఏడో తరగతి వరకు బోధన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే అవసరమైన చోట క్రాస్-సబ్జెక్ట్ టీచింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు ఉండనున్నాయి. మైనార్టీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ప్రత్యేక సెలవులు అమల్లో ఉంటాయి. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 27 వరకు ఉండగా.. సాధారణ సెలవు డిసెంబర్ 25న ఉంటుంది. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 17 వరకు ప్రకటించారు. మైనార్టీ విద్యాసంస్థలకు జనవరి 13 నుంచి 17 వరకు సెలవులు వర్తిస్తాయి.
పరీక్షల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు (FA) ఆగస్టు నుంచి ఆరంభం అవుతాయి. ఆగస్టు 3 నుంచి 6 వరకు (FA-1), అక్టోబర్ 5 నుంచి 8 వరకు (FA-2), జనవరి 4 నుంచి 7 వరకు (FA-3), ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు (FA-4) నిర్వహించనున్నారు. సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA) పరీక్షల్లో భాగంగా SA-1 పరీక్షలు నవంబర్ 9 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. SA-2 పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 17 వరకు (1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు) జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించారు. ప్రీ-ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు, గ్రాండ్ టెస్ట్‌లు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 15 నుంచి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.