Reading Time: < 1 minute

సమగ్ర దర్యాప్తు జరపండి..మామిడి పండ్లు తిని బాలికలు మృతి చెందడంపై సీపీ సజ్జనార్ ఆదేశం

Caption of Image.

నారాయణగూడ, వెలుగు: హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి పండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై ఇటీవల ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించారు. మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి మృతి చెందిన బాలికల అంతర్గత అవయవాల (విసేరా) నమూనాలను భద్రపరచాలని, వైద్య నిపుణుల నుంచి తుది అభిప్రాయాలను తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు.

కర్నాటకలోని బీదర్‌‌‌‌కు  చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతుల కుమార్తెలు భువనేశ్వరి (17), సంధ్య (10) ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరి బంధువు రేణుక కొనుగోలు చేసిన మామిడి పండ్లను ఇందుమతి, ఆమె ఐదుగురు కుమార్తెలు, రేణుక, ఆమె కుమారుడు, ఆమె తల్లితో కలిపి మొత్తం 9 మంది తిన్నారు. మామిడి పండ్లు తిన్న కొద్దిసేపటికే ఇందుమతి నలుగురు కుమార్తెలు తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

దీంతో వారిని వెంటనే కాచిగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం భువనేశ్వరి, మంగళవారం సంధ్య మృతి చెందారు. తల్లి ఇందుమతితో పాటు ఒక కుమార్తె కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో కుమార్తె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

ఈ మరణాలకు మామిడి పండ్లను మగ్గబెట్టడానికి వాడిన రసాయనాలే కారణమా? లేక ఇతర ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన ఫుడ్, ఫ్రూట్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపినట్టు అధికారులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

©️ VIL Media Pvt Ltd.