
- రసాయన ఎరువులు తగ్గించండి
- ప్రకృతి వ్యవసాయంతో కోటీశ్వరులు కావొచ్చని వెల్లడి
జమ్మికుంట, వెలుగు: సాగు విధానంలో రైతులు మార్పులు చేసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. రాష్ట్రంలోని రైతాంగం రసాయన ఎరువులను విడనాడి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తే.. రానున్న రోజుల్లో కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ‘ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముందుగా గోమాత, భూమాత పూజలు నిర్వహించి.. స్టాల్స్ ను, ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంట సాగులో రసాయన ఎరువులు తగ్గించాలని సూచించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలు తిని రోగాలు తెచ్చుకుంటున్నామని, అందుకే ఎరువుల ద్వారా పండిస్తున్న పంటలకు స్వస్తి చెప్పి.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని ఆయన సూచించారు.
గోమాత భరతమాత నినాదంతో మూడేండ్ల పాటు 6 2,018 మంది రైతులతో 19 గ్రామాల్లో పదివేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. రాబోయే రోజుల్లో 50 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్న జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులను అభినందించారు.
దేశంలో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లీ ఇస్తానని ప్రధాని ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రెండేండ్లలో 25వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఎరువుల సబ్సిడీ పేరుతో రైతులకు దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, అందులో విదేశాల నుంచి ఎరువులను తెప్పించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షా ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
నేచురల్ ఫామింగ్ హబ్ గా భారత్..
దేశాన్ని నేచురల్ ఫామింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దీనికోసం పరం పరాగత్ కృషి వికాస్ యోజన వంటి పథకాలను ప్రవేశపెట్టినట్టు కేంద్ర మంత్రి సంజయ్తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండేండ్ల పాటు ప్రోత్సాహక సహాయం అందజేస్తున్నామని, జీవామృతం బీజామృతం తయారీపై రైతులకు నిరంతర శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
దేశానికి అన్నపూర్ణగా విలసిల్లిన పంజాబ్లో రసాయన ఎరువుల వల్ల క్యాన్సర్ రోగులు ఎక్కువయ్యారని, ప్రస్తుతం వారి కోసం ప్రత్యేక ట్రైన్లు వెళ్తున్న దృశ్యాలు కనబడడం బాధాకరమన్నారు. ప్రకృతి వ్యవసాయంతో వచ్చిన పంటలకు మద్దతు ధర ఇచ్చేలా చూస్తామనిన్నారు. పంటలను కొని రోగాలు తెచ్చుకోకుండా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శత్రు నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి , కేవీకే సెక్రటరీ విజయగోపాల్ రెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.