Reading Time: 5 minutes
Story Board About Ap Caste Politics Analysis How Caste Continues To Shape Andhra Pradesh Elections And Governance

Story Board: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనేది ఎప్పుడూ ఒక కీలకమైన అంశమే. తరాలు మారినా.. ఈ కులం మాత్రం ఏపీ రాజకీయాల్ని వదలడం లేదు. అసలు ఏపీ సమాజంలోనే కులం పెనవేసుకుపోయిందనే చర్చ కూడా ఎప్పట్నుంచో జరుగుతోంది. దీనికి ఏపీలో జరిగిన కొన్ని ఘటనల్ని ఉదహిరస్తుంటారు. గతంలో వంగవీటి మోహన రంగా హత్య సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సామాజిక వర్గాలతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఆయా సందర్భాలను వాడుకుని పార్టీలు ఓ రేంజ్‌లో కుల రాజకీయం చేశాయి. ఈ ఘటనను ఇప్పటికీ ఎన్నికల సమయంలో బయటకు తీస్తూనే ఉంటారు నేతలు. ఇక గత దశాబ్దంలో జరిగిన తుని రైలు దహనం, అమలాపురంలో కులాల కుంటప్ల గొడవలు చూస్తే.. కులాన్ని రాజకీయం ఏ రేంజ్‌లో వాడుకుంటుందనే విషయం తేటతెల్లమౌతుంది. తునిలో ఓ కులం సంక్షేమం కోసం పెట్టుకున్న సభ కాస్తా.. అదుపు తప్పి.. రైలు దహనానికి దారితీసి.. చివరకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది. ఇక్కడ కూడా సభ కేవలం కుల సంబంధమైన విషయాలకే పరిమితమైతే.. శాంతియుతంగా సమవేశం జరిగేదని, కానీ రాజకీయ రంగు పులుముకోవడమే కొంప ముంచిందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇలా కుల జాడ్యం కేవలం రాజకీయాలు, పార్టీలు, నేతలకే పరిమితం కాలేదు. చివరకు పాలనలో భాగంగా సర్కారు తీసుకునే నిర్ణయాలకూ కులం రంగు పులమడం రివాజుగా మారింది. జిల్లాల పునర్విభజన సందర్భంగా కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్‌ పేరు పెట్టడంపైనే కులాల రగడ రాజుకుంది. ఇక్కడ అభ్యంతర పెట్టే విషయం లేకపోయినా.. పార్టీలు పనికట్టుకుని కులాల మధ్య కొట్లాటను పెంచి పోషించాయని తర్వాత తేలింది. ఇక ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్‌ కేసులో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అసలేం జరిగింది..? నిందితులు, జరిగిన నేరం.. జరగాల్సిన న్యాయం వెనక్కివెళ్లిపోయింది. ఇక్కడ కూడా ప్రతి పార్టీ సాయికృష్ణ కులాన్ని పట్టుకుని రాజకీయం చేయడం షురూ చేశాయి. చివరకు లాకప్‌ డెత్‌ కాస్తా.. కుల రచ్చకు దారితీసింది. దీన్నో కారణంగా చూపిస్తూ.. ఓ పార్టీ కుల సమావేశం పెడితే.. మరో పార్టీ దానికి కౌంటర్ ఇచ్చే పనిలో బిజీగా ఉంది. ఇక ఇంకో పార్టీ తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తోంది. చివరకు అసలు విషయం మాట్లాడాలని సాయికృష్ణ తల్లి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకోవాల్సినంతగా పరిస్థితి దిగజారింది.

ఏతావాతా కుల రాజకీయానికి అలవాటుపడ్డ జరుగుతున్న ప్రస్తుత పరిణామాలేవీ విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగించడం లేదు. అలాగే కుల రాజకీయం చేస్తున్న పార్టీలు కూడా తమ పరిస్థితులు, అవకాశాలు, ప్రయత్నాలకు అనుగుణంగా తమ స్టాండ్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కూడా పరిస్థితిని బట్టి.. తమ వాదన గట్టిగానే వినిపిస్తున్నారు. అంతిమంగా ఈ కుల పోరులో గెలుపెవరిది అనే చర్చ అయితే ఆసక్తికరంగా మారింది. ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో కేవలం కులమే ఆధారంగా రాజకీయం నడుస్తోంది. ఆ పార్టీ.. ఈపార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలూ ఆ వ్యూహంతోనే వెళ్తున్నాయి. ఈ జిల్లా అయితే ఈ కులం.. ఆ జిల్లా అయితే ఆ కులం అనే లెక్కలు కూడా నడుస్తున్నాయి. కులాల వారీగా ఓట్లు సాధించడం తేలిక అనే లెక్కలో పార్టీలున్నాయి. ఇందుకోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నాయి. కులాల వారిగా ఓటు బ్యాంక్‌పై దృష్టి సారించి పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అంతకుముందు కులాల వారీగా ప్రభుత్వ పథకాల పంపిణీ ఉన్నా.. ఇంత పక్కా ఓట్ల లెక్కలు చేయలేదు. ఇప్పుడు ఏ కులం ఓట్లు ఎటు పోతున్నాయో చూసి మరీ సామాజిక సమీకరణాల లెక్కలు వేసి స్ట్రాటజీ వేస్తున్నారు. అభ్యర్ధి గుణగణాలు, పార్టీల హామీల కన్నా కులమే మన ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది.ఏపీలో ఎన్నికలప్పుడు కుల రాజకీయం రగులుకోవడం సాధారణమే అయినా.. ఈసారి ఎన్నికలతో సంబంధం లేకుండా.. రాజుకున్న కుల రాజకీయం ఏ తీరానికి చేరుతుందనేది చూడాల్సి ఉంది.

కులమే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తుందనేది పార్టీల నమ్మకం. నాయకులు కులాల వారీగా విడిపోవడమే కాకుండా, ఈ సమాజాన్ని కూడా అదే విధంగా విడగొట్టే విధంగా తయారుచేస్తున్నారు.రాజకీయం అంతా కులాల వారీగా విడిపోయినట్టుగానే కనిపిస్తోంది.ఒక పార్టీ అధికారంలో ఉండగా, తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన నాయకులను, అధికారులను టార్గెట్ చేసుకుంటూ ,వేధిస్తూ, విమర్శిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ రావడం, అలా అధికార పార్టీ చేతిలో ఇబ్బందులకు గురైన వారి పార్టీ, మళ్లీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవ్వడం, ఇవన్నీ పరిపాటిగా మారిపోయాయి. ఏపీలో కుల రాజ‌కీయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స‌మాజంలో జ‌రుగుతున్న ప్రతి సంఘ‌ట‌న‌కు కులం రంగు పులుముకుంటోంది. ఎవరికి వారికి వారి వారి కులాల‌పై అభిమానముండ‌టాన్ని తప్పు ప‌ట్టలేం. కానీ అది శ్రుతిమించి దుర‌భిమానంగా మారుతోంది. త‌ద్వారా విద్వేషాగ్నులు ర‌గులుతున్నాయి. దీంతో రాజ‌కీయ య‌వ‌నిక‌పై అవాంఛ‌నీయ ప‌రిణామాలు త‌లెత్తి సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడటానికి కారణమవుతున్నాయి. ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు.

కుల సమీకరణలు, పోలరైజేషన్స్ కోసం పార్టీలు పాకులాడుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. కుల పునాదులపై అధికార పీఠం ఎక్కాలన్న వ్యూహం కనిపిస్తోందన్న విశ్లేషణ జరుగుతోంది. కులంపైనే రాజకీయం నడుస్తోంది. కులాల లెక్కలపైనే నాయకులు సమీకరణాలు వేస్తున్నారు. పార్టీలూ అలాగే వున్నాయి. ఏపీలో కులం పేరుతో పార్టీలు చేసే రాజకీయం ఓ ఎత్తైతే.. కుల సంఘాల హడావుడి మరో ఎత్తు. అందుకే అన్ని పార్టీల నేతలూ.. కుల సంఘాలతో టచ్‌లో ఉంటూ.. అవసరం వచ్చినప్పుడు కుల రాజకీయం చేయటానికి ఈ సంఘాల్ని కూడా వాడుకుంటూ ఉంటారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే కుల ప్రస్తావ‌న తెస్తుండ‌టంతో ఒక‌ర‌కంగా కులానికి రాజ‌ముద్ర ప‌డిపోయింది. సోష‌ల్ మీడియాలో అయితే ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. ప్ర‌స్తుత స‌మాజం కులాల‌వారీగా చీలిపోయింది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్లు అభ్యంత‌ర‌క‌రంగా ఉంటున్నాయ‌ంటూ పోలీసులు కేసులు పెడుతున్న‌ప్ప‌టికీ అవి తగ్గడంలేదు. ఓవైపు కుల రాజకీయానికి స్వస్తి పలకాలని చెబుతున్న నేతలే.. మరోవైపు సందర్భానుసారంగా అదే కుల రాజకీయాన్ని పెంచి పోషిస్తున్న విమర్శలూ లేకపోలేదు. సింపుల్‌గా చెప్పాలంటే.. తమకు కులంతో అవసరం ఉంటే ఒకలా.. లేదంటే మరోలా రాజకీయం చేయడంలో పార్టీలు, నేతలు ఆరితేరిపోయారు.

కులం పేరు చెప్పుకుని ఓట్లు తెచ్చుకోవడం, సీట్లు గెలవడమే రాజకీయం అంటున్నాయి పార్టీలు. ఎవరేమనుకున్నా తామింతే అని తేల్చి చెబుతున్నాయి. ఎన్నిక ఎన్నికకూ కులం ప్రభావం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.మొదట్లో రాజకీయాల్లో కులం ఓ గుర్తింపు. తర్వాత అది బలంగా మారింది. ఇప్పుడు నేతలు ఏకంగా కులం పేరుతో బిజినెస్ చేస్తున్నారు. కులం ఓట్లని మార్కెట్లో వేలం వేస్తున్నారు. ఎవరెంతకు పాడుకుంటే వారికే కులం ఓట్లని నమ్మిస్తున్నారు. అలాగని ఇక్కడ ఎంతిచ్చినా ఎవరూ ఓటుకి గ్యారంటీ ఇవ్వరు. అయినా సరే ఏ పార్టీ కూడా కులాన్ని ఆకట్టుకోవడానికి వెనుకడుగు వేయదు. ఎవరి ప్రయత్నాలు వారు చేసి.. ఎక్కువ కులాలు తమ వెంటే ఉన్నాయని చెప్పుకోవడానికి తాపత్రయపడతారు. ఏ కులం ఎన్నికల్లో గెలిపిస్తుంది.. ఏది గెలిపించదు అనే లెక్కలు మాకున్నాయంటాయి పార్టీలు. ఎన్నికలకు ఓటర్ల మూడ్ సెట్ చేసే ప్రక్రియలో కుల బలం కూడగట్టడం కీలకమని చెబుతున్నాయి. ప్రత్యర్థులపై నైతికంగా పైచేయి సాధించడానికి కుల బలం ఉపయోగపడుతుందని, అప్పుడు గెలుపు తేలికవుతుందని లెక్కలేసే పార్టీలు కూడా ఉన్నాయి. ఇలా కేవలం ప్రత్యక్ష ప్రభావం కోసమే కాదు.. పరోక్ష ప్రభావం చూపాలన్నా కులమే బలమని తేల్చేస్తున్నాయి.

కేవలం ఓటు బ్యాంకు రాజకీయంపైనే గురిపెట్టిన పార్టీలు.. కులాల ప్రాతిపాదికనే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్ని కూడా కేటాయిస్తున్నాయి. కులాల లెక్కలు చూసుకుని ఇప్పటికే టికెట్లు ప్రకటించిన చోట కూడా అభ్యర్థుల్ని మార్చుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఏ పదవులు ఇచ్చినా.. ఏ పనిచేసినా.. కులాల లెక్కులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కులాల విషయంలో గేమ్స్ ఆడలేమని పార్టీలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కుల రాజ‌కీయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స‌మాజంలో జ‌రుగుతున్న ప్రతి సంఘ‌ట‌న‌కు కులం రంగు పులుముకుంటోంది. ఎవరికి వారికి వారి వారి కులాల‌పై అభిమానముండ‌టాన్ని తప్పు ప‌ట్టలేం. కానీ అది శ్రుతిమించి దుర‌భిమానంగా మారుతోంది. త‌ద్వారా విద్వేషాగ్నులు ర‌గులుతున్నాయి. దీంతో రాజ‌కీయ య‌వ‌నిక‌పై అవాంఛ‌నీయ ప‌రిణామాలు త‌లెత్తి సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడటానికి కారణమవుతున్నాయి.

కులం పేరుతో రాజకీయం చేయడంతో అయిపోలేదు. ఓ కులానికి చెందినవాడిగా చెప్పుకోవడాన్ని నేతలు గర్వంగా ఫీలయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నికలు రాగానే కులాలకు లేని ఘనతలు, చరిత్రలు ఆపాదించడం, ఇతర కులాల్ని రెచ్చగొట్టడం లాంటి చీప్ ట్రిక్స్ కూడా చేస్తున్నారు. కులానికి సంబంధించి పాజిటివ్ ఓటు, నెగటివ్ ఓటు ఎలా కుదిరితే అలా.. గంపగుత్త కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. కుల రాజకీయం చేయడంలో కొందరు నేతలు పండిపోయారు. ఏం చెబితే కులం జనం కనెక్ట్ అవుతారో రీసెర్చ్ చేసి మరీ.. స్పీచులు దంచుతారు. ఒక్క ప్రెస్ మీట్ తో కులంలో ఆలోచన కలిగేలా చేయడంలో ఆరితేరిపోయారు. జనానికి ఏమీ చేయకపోయినా.. కులం అండతో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలు ఉన్నారంటే.. రాజకీయాల్లో కులం పాత్రం ఎంత కీలకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఓ నేత రాజకీయ అవసరం కోసం అర్జెంట్‌గా కుల సంఘం మీటింగ్ పెడతారు. మరో పార్టీ రాజకీయ లబ్ధి కోసం చిన్న విషయానికి కులం రంగు పులిమి.. దాన్ని చాలా పెద్దది చేస్తారు. ఇలా ఎలా వీలైతే.. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏపీలో కుల రాజకీయం నిరంతరంగా సాగుతూనే ఉంది. ఇక్కడ పార్టీల పేర్లు మారుతున్నాయి. నేతలు మారుతున్నారు. చివరకు రాజకీయాల్లో తరాలు మారుతున్నాయి. కానీ కులం మాత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తోంది. అలా నిలిచేలా పార్టీలు, నేతలు కలిసికట్టుగా కుల రాజకీయాన్ని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు కుల రాజకీయానికి ప్రాధాన్యత తగ్గిపోతే.. సగానికి పైగా నేతల రాజకీయ భవితవ్యం జీరో అవుతుందనే భయం కూడా పార్టీల్లో కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఇందుకోసే పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కుల రాజకీయాన్ని పెంచి పోషిస్తున్నారు. కులం పేరు చెబితే టికెట్ వస్తుంది. కులంలో కాస్త ప్రాబల్యం పెంచుకుంటే పెద్ద పదవి వస్తుంది. కులానికి నాయకుడు అనే ఇమేజ్ వస్తే.. ఇక పార్టీలు చెప్పినట్టు ఆడతాయి. అదీ కులానికి ఉన్న పవర్ అంటున్నారు నేతలు. కులంలో ఎన్ని ఓట్లున్నా పర్లేదు.. ఆ ఓట్లన్నీ మనం చెప్పినట్టే పడతాయనే భరోసా ఇచ్చే స్థాయి ఉంటే చాలు.. వద్దన్నా పదవులొస్తాయనే లెక్కలకు కొదవలేదు. అన్ని కులాల్నీ సమానంగా చూస్తున్నామని చెప్పుకోవడానికైనా కులాల వారీగా జనాభా లెక్కలు చూసి పదవులు ఇవ్వక తప్పదనే వాదన ఉంది. ఏదో రకంగా కుల ప్రస్తావన లేకుండా ఏపీలో రాజకీయం చేయడం కుదరదని తమ చర్యల ద్వారా తెగేసి చెబుతున్నాయి పార్టీలు.

కులం ముసుగులో గుద్దులాట, కులంతో దోబూచులాట పాలిటిక్స్ కు కాలం చెల్లింది. ఇఫ్పుడంతా కులం పేరుతో డైరక్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ కులం పేరు చెప్పడానికైనా ఏ పార్టీ కూడా వెనుకాడటం లేదు. కొన్ని కులాలు తమ వెనుక ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటున్నాయి. మిగతా కులాలు దూరమౌతాయనే శషభిషలు పెట్టుకోవడం లేదు. తమ వెంట వచ్చే కులాలు బాగుపడతాయనే సంకేతాలు కూడా ఇస్తున్నాయి. పార్టీల ఆకాంక్షలకు తగ్గట్టుగా నేతలు కూడా అదే సూత్రాన్ని వంటబట్టించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నికల ఫలితాల్ని సోషల్ ఇంజినీరింగా బాగా ప్రభావితం చేస్తుంది. దీంతో కచ్చితంగా కుల రాజకీయంపై పట్టు సాధించక తప్పడం లేదనేది పార్టీల మాట. పోలింగ్ కు ముందే సరైన ఈక్వేషన్ సెట్ చేసుకుంటే గెలుపుని ఎవరూ ఆపలేరని చెబుతున్నాయి పార్టీలు. కులాల లెక్క కుదిరితే దేని గురించీ టెన్షన్ పడక్కర్లేదని చెబుతున్నాయి. తేలికగా ఎన్నికల్లో గెలిచే మార్గంగా ఉన్న కులాన్ని ఎందుకు వదిలేయాలని అడుగుతున్నాయి. పార్టీలైనా, నేతలైనా ఎన్నికల సమయంలో కులాల ఓట్లు, కుల సంఘాల ప్రాపకం కోసం పాకులాడక తప్పడం లేదనేలా రాజకీయం సాగుతోంది. ఇప్పట్లో ఈ రాజకీయం మారుతుందా.. అంటే జవాబు చెప్పడం కష్టమే. ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్న కులరాజకీయం ఇంకా భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్తుందో అనే ఆందోళన కూడా వ్యక్తమౌతోంది.