
ప్రభుత్వ ఉద్యోగులు రోజుకో గంట సేపు అదనంగా పనిచేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం ప్రారంభ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. గత పాలకుల పదేళ్ల పాలనలో 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లో ముంచి, దివాళా తీయించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు. గతంలో మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేదా? అని సీఎం ప్రశ్నించారు.
కానీ నేడు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఏ ఒక్క రోజూ ఆలస్యం కాకుండా, ప్రతి నెలా మొదటి తారీఖునే ఉద్యోగులందరికీ జీతాలు అందిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులను కూడా విడతల వారీగా విడుదల చేస్తున్నాం.ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే.. నేరుగా మా దృష్టికి తీసుకురండి. కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం. ప్రజలకు చేరుతున్న ప్రతి సంక్షేమ పథకం వెనుక.. మీ కష్టం, మీ కృషి ఉన్నాయి. మీ నమ్మకమే మా ప్రభుత్వానికి కొండంత బలం.
►ALSO READ | గుడ్ న్యూస్.. ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
అందుకే రాష్ట్రం కోసం రోజుకు ఒక గంట అదనంగా పని చేయండి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో భాగస్వాములు కండి. అలా పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీ అవసరాలను తీర్చడానికే ప్రభుత్వం ఉపయోగిస్తుంది. నిర్ణయాలు మేము తీసుకున్నా.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అమలు చేసేది మీరే. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా.. రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలన్నా.. అది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. రండి.. కలిసికట్టుగా నవ తెలంగాణను నిర్మించుకుందాం అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.