
Kitchen Cleaning Tips: వంటగదిలో వంట చేసే సమయంలో నూనె, మసాలాల ఆవిర్లు గోడలు, క్యాబినెట్లు మాత్రమే కాదు.. లైట్ స్విచ్‌లు, స్విచ్ బోర్డులపై కూడా పేరుకుపోతాయి. కాలక్రమేణా అవి జిగురుగా మారి నల్లబడిపోతాయి.. అవి తొలగించే ప్రయత్నం చేసినా.. ఎంతకు తొలగిపోకుండా మొండి మరకల్లా మారిపోతాయి.. అయితే కొన్ని సులభమైన, సురక్షితమైన ఇంటి చిట్కాలతో ఈ మొండి మరకలను సులభంగా తొలగించవచ్చు.
* ముందుగా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. శుభ్రపరిచే ముందు మెయిన్ స్విచ్ లేదా MCBని ఆఫ్ చేయాలి. రబ్బరు చెప్పులు, పొడి చేతి తొడుగులు ధరించడం మంచిది. ఎలక్ట్రికల్ బోర్డులపై నేరుగా నీరు లేదా ద్రవాలను స్ప్రే చేయకూడదు.
* స్విచ్ బోర్డులను శుభ్రం చేయడానికి రబ్బింగ్ ఆల్కహాల్ (ఐసోప్రొపైల్ ఆల్కహాల్) ఉత్తమ ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోఫైబర్ గుడ్డపై కొద్దిగా ఆల్కహాల్ వేసి స్విచ్‌లను తుడిస్తే పేరుకుపోయిన నూనె, మురికి సులభంగా తొలగిపోతాయి. ఇది త్వరగా ఆవిరైపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కూడా ఉండదు.
* ఇంట్లో రబ్బింగ్ ఆల్కహాల్ లేకపోతే తెల్ల వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల డిష్‌వాష్ లిక్విడ్, ఒక టీస్పూన్ వెనిగర్ కలిపి గుడ్డతో తుడవాలి. మూలల్లోని మురికిని పాత టూత్ బ్రష్‌తో శుభ్రం చేయవచ్చు.
* శుభ్రపరిచిన తర్వాత బోర్డును పూర్తిగా పొడి గుడ్డతో తుడిచి, పూర్తిగా ఆరిన తర్వాతే విద్యుత్ సరఫరాను ఆన్ చేయాలి. ఇలా చేస్తే మీ కిచెన్ స్విచ్ బోర్డులు కొత్తవాటిలా మెరిసిపోతాయి.