Reading Time: < 1 minute
Lashkar E Taiba Commander Mir Shukr Khan Raissani Killed In Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల హల్చల్ చేశారు. ఉగ్రవాద నాయకుడిపై మరోసారి టార్గెటెడ్ అటాక్ జరిగింది. ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రావిన్సులో అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ సీనియర్ కమాండర్ మీర్ శుక్ర ఖాన్ రైసాని హతమయ్యాడు. ఇటీవల కాలంలో లష్కరేకు చెందిన పెద్ద తలకాయలను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తు్న్నారు. ఏ ప్రావిన్సులో ఉన్నా కూడా వెతికి మరి చంపుతున్నారు.

తాజాగా జరిగిన సంఘటన బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగింది. ఒక లష్కరే తోయిబా కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే రైసాని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ దాడిపై పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు ఈ హత్యకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. ఇలాంటి ఘటనలకు పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా భారత్ సహకరిస్తుందని ఆరోపిస్తోంది.

రైసానీ మరణానికి ఒక రోజు ముందు క్వెట్టాలో లష్కరే తోయిబా నిర్వహించిన ‘‘మార్కా-ఎ-హక్’’ వార్షికోత్సవక కార్యక్రమంలో పాల్గొన్నాడు. లష్కర్ బలూచిస్తాన్ చీఫ్ హాఫిజ్ ఇద్రీస్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రైసాని బలూచ్ లష్కరే నెట్వర్క్‌లో ప్రముఖ వ్యక్తి. ఉగ్రవాద సంస్థ రిక్రూట్మెంట్, శిక్షణ వంటి కీలక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. బలూచిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్‌లో చీలికలు, అంతర్గత పోరు, వేర్పాటువాదుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ హత్య జరిగింది.

టీవలి నెలల్లో, షేక్ యూసుఫ్ అఫ్రిది, అమీర్ హమ్జా తదితరులతో సహా పలువురు ఉన్నత స్థాయి లష్కర్-ఎ-తైబా కమాండర్లు ఇలాంటి గుర్తుతెలియని సాయుధ దాడులలో హతమయ్యారు. హఫీజ్ సయీద్ స్థాపించిన ఈ ఉగ్ర సంస్థ భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పని చేస్తోంది. 2008 ముంబై ఉగ్ర దాడులకు ఈ సంస్థే సూత్రధారి.