
గత కొంత కాలంగా ఐటీ రంగం అంటేనే లేఆఫ్స్ అనే భయం టెక్కీలను వెంటాడుతోంది. కాగ్నిజెంట్, టీసీఎస్, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంటే.. ఇన్ఫోసిస్ మాత్రం అందుకు భిన్నమైన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ సంస్థలో లేఆఫ్స్ ఉండబోవని ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ స్పష్టం చేయడంతో టెక్కీలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఏఐతో ఉద్యోగాలకు ఢోకా లేదు..
ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఊడిపోతాయన్న వార్తలను సలిల్ పరేఖ్ కొట్టిపారేశారు. ఏఐ వల్ల పని పరిధి పెరుగుతుందే తప్ప తగ్గదని చెప్పారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పిస్తామే తప్ప, వారిని తొలగించే ఆలోచన లేదని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఆదాయంలో ఏఐ వాటా 5.5 శాతంగా ఉందని ఇది వేగంగా పెరుగుతోందని చెప్పారు.
ఉద్యోగులను తీసేయడం అనే మాటలను పక్కన పెడితే.. కొత్త రక్తానికి ఇన్ఫోసిస్ పెద్దపీట వేస్తోంది. ఈ ఏడాది కూడా దాదాపు 20వేల మంది ఫ్రెషర్లను క్యాంపస్ హైరింగ్ ద్వారా తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. గతేడాది కూడా ఇదే స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరగడం విశేషం. దీనివల్ల నిరుద్యోగ టెక్కీల్లో సరికొత్త ఉత్సాహం మెుదలైంది. జాబ్ కొట్టాలంటే స్కిల్స్ పక్కాగా ఉంటే సరిపోతుందని యువత గమనిస్తే ఐటీ రంగంలో మంచి అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఇన్ఫోసిస్ ప్రకటన చెబుతోంది.
ఎంట్రీ లెవల్ ఉద్యోగాల స్వభావం మారుతున్న వేళ.. ఇన్ఫోసిస్ తన ఇంజనీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఏఐ టూల్స్ సహాయంతో కోడింగ్ చేయడం, వాటిని విశ్లేషించడం వంటి అంశాలపై ఉద్యోగులను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడమే కాకుండా.. ‘టోపాజ్ ఫ్యాబ్రిక్’ వంటి అంతర్గత ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఇన్ఫోసిస్ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఇచ్చిన ఈ భరోసా టెక్కీల పాలిట వరంగా మారింది. గత ఏడాది లాగానే లేఆఫ్స్ ఉండవు అంటూ ఇన్ఫోసిస్ చెప్పటంతో టెక్కీలు ఆల్ ఈజ్ వెల్ అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు.