
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న హెచ్‌వన్‌బీ వీసా ఫీజు పెంపు విషయంలో చుక్కెదురైతే.. ఇప్పుడు జన్మతఃపౌరసత్వం కేసులోనూ షాక్ తప్పలేదు. అంతకుముందు ఇష్టారాజ్యంగా విధించిన సుంకాలు కూడా చెల్లవని న్యాయస్థానాలు దిమ్మతిరిగేలా తీర్పునిచ్చాయి. కానీ తనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జిలు.. తనను మాత్రమే కాకుండా.. మొత్తంగా దేశాన్నే బాధిస్తున్నారని ట్రంప్ విపరీత భాష్యం చెబుతున్నారు. మొత్తం మీద అధ్యక్షుడైన దగ్గర్నుంచీ తలతిక్క నిర్ణయాలతో అందర్నీ వేపుకుతింటున్న ట్రంప్‌ను మరో రెండున్నరేళ్లు భరించక తప్పని దుస్థితి నెలకొంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం, అమెరికా గడ్డపై జన్మించిన దాదాపు పిల్లలందరికీ పౌరసత్వ హక్కు ఉంటుందనే సుదీర్ఘకాలంగా స్థిరపడిన సూత్రాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ కుదరదంటూ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కొట్టేసింది. దీంతో కోట్ల మందికి పెద్ద ఊరట దక్కింది.
అమెరికాలో జన్మహక్కు ఆధారంగా పౌరసత్వం కల్పించడాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమెరికా సుప్రీం కోర్టు కొట్టేసింది. అమెరికాలో జన్మించిన శిశువులకు సహజంగా అమెరికా పౌరసత్వం కల్పించే 150 ఏళ్లనాటి న్యాయ ఉదంతాన్ని న్యాయమూర్తులు సమర్థించారు. అంతకుముందు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన శిశువులకు ఈ జన్మతఃపౌరసత్వాన్ని నిలిపివేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేశారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు, అమెరికా రాజ్యాంగం ప్రకారం పుట్టుకతోనే పౌరులు అవుతారని అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. ఈ తీర్పులో ఆయన 14వ రాజ్యాంగ సవరణ చరిత్రను ప్రస్తావించారు. అమెరికా అంతర్యుద్ధం తర్వాత, ఇక్కడే జన్మించి బానిసత్వం నుంచి విముక్తి పొందిన మాజీ బానిసల పౌరసత్వ సమస్యను పరిష్కరించడానికి అప్పట్లో ఈ సవరణను తీసుకువచ్చారు. అప్పుడు, ఇప్పుడు కూడా పౌరసత్వం అనేది హక్కులను పొందే ఒక హక్కు. అమెరికా రాజకీయ వ్యవస్థలో స్వేచ్ఛగా భాగస్వామ్యం పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 14వ సవరణను రూపొందించిన వారు ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తికీ ఆ హక్కు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈరోజు ఆ వాగ్దానాన్ని మేం నిలబెడుతున్నాం అని రాబర్ట్స్ తన తీర్పులో పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పును విభేదించిన న్యాయమూర్తుల్లో జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ నీల్ గోర్సచ్, జస్టిస్ శామ్యూల్ అలిటోలు ఉన్నారు.
తాను ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసులో ఎదురైన పరాజయంపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంకా స్పందించలేదు. తన రెండో విడత పదవీకాలంలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి రోజే, పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కుకు పరిమితులు విధించాలనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అక్రమ వలసదారులు, తాత్కాలిక నివాస వలసదారులకు పుట్టిన పిల్లలు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరులు కాకుండా నిరోధించేందుకు ట్రంప్ ఈ ఉత్తర్వులు తీసుకొచ్చారు. ట్రంప్ దూరాలోచన మొత్తంగా అమెరికా మౌలిక వలస విధానానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
అమెరికన్ పౌరసత్వం అర్థం, విలువను పరిరక్షించడం అనే శీర్షికతో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును ట్రంప్ గతంలో జారీ చేశారు. ట్రంప్ రెండో పదవీకాలం మొదటి రోజైన జనవరి 20, 2025న జన్మహక్కు పౌరసత్వంపై న్యాయ పోరాటం ప్రారంభమైంది. ట్రంప్ ఆర్డర్ ప్రకారం..అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు ఇకపై ఆటోమేటిక్‌గా పౌరసత్వం మంజూరు అవ్వదు. ప్రత్యేకంగా, అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వలసదారులకు జన్మించిన పిల్లలకు పౌరసత్వం లభించదు. అంతేకాకుండా, విద్యార్థి, పని, లేదా పర్యాటక వీసాల వంటి చెల్లుబాటు అయ్యే, కానీ తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు కూడా పౌరసత్వం మంజూరు కాదు. అధ్యక్షుడి ఉత్తర్వు తక్షణమే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంది. పౌర హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల సంఘాలు, గర్భిణీ స్త్రీలు న్యాయస్థానాలను ఆశ్రయించి, వ్యాజ్యాలు కొనసాగుతున్న సమయంలో ఆ ఉత్తర్వు అమలును నిలిపివేయడంలో విజయం సాధించారు. నిజానికి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ విషయంలో ట్రంప్ ఉత్తర్వు ఎన్నడూ అమలు కాలేదు. ఈ వ్యవహారాన్ని విచారించిన దిగువ కోర్టులు గతంలోనే ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా, తాజాగా అమెరికా సుప్రీం కోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చిచెప్పింది. దీంతో అమెరికాలో పుట్టిన ప్రతి చిన్నారికి పౌరసత్వ హక్కు కొనసాగనుంది.
జన్మతఃపౌరసత్వం కేసులో తీర్పు సందర్భంగా అమెరికా సుప్రీంకోర్టు.. ఆ దేశ మౌలిక విలువల్ని మరోసారి గుర్తుచేసింది. అమెరికా ఒక జాతి కాదు. అది నానాజాతుల సమూహంగా ఏర్పడింది. అలాగే అమెరికాకు వేల ఏళ్ల చరిత్ర కూడా లేదు. అమెరికా ఉనికి వయసు కేవలం నాలుగు వందల ఏళ్లే. అలా చూసినప్పుడు అమెరికా ఎవరిదీ కాదు. భూమ్మీద ఉన్నవారందరికీ అమెరికాలో సమాన అవకాశాలు కల్పిస్తామని ఆ దేశ రాజ్యాంగ నిర్మాతలు వాగ్దానం చేశారు. అందుకు అనుగుణంగానే అమెరికా రాజ్యాంగం రూపొందింది. అందుకే అమెరికా అవకాశాల స్వర్గంగా పేరు తెచ్చుకుంది. మధ్యలో వలసదారులపై ఆంక్షలు, నియంత్రణలు, షరతులకు కూడా అమెరికా కాంగ్రెస్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇంకా మాట్లాడితే.. ఏ రూపంలో అయినా అమెరికన్లకూ, వలసదారులకూ తేడా చూపించే ఏ రకమైన విధానాన్నీ అమెరికా ఒప్పుకోలేదు. అలాంటి ఘన వారసత్వం ఉన్న అమెరికాకు.. ఇప్పుడు ట్రంప్ లాంటి తలతిక్క అధ్యక్షుడు వచ్చారు. అసలైన అమెరికా అంటే అర్థం చేసుకోలేని ట్రంప్.. అమెరికన్లపై జాతుల భేదాన్ని, వర్ణ వివక్ష లాంటి అనాగరిక విధానాల్ని రుద్దటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా వీటన్నింటికీ అమెరికాకు సంబంధమే లేని జాతీయవాదం ముసుగేసి.. ఎన్నికల అజెండాలో ఇచ్చిన హామీల ప్రకారం.. వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ట్రంప్ దూకుడుకు కోర్టులు అడ్డుకట్ట వేస్తూ వచ్చాయి. అసలు అమెరికా కోర్టులు ఇంత క్రియాశీలకంగా లేకపోతే.. ఈపాటికి ట్రంప్ అమెరికాను ఏం చేసేవారోనని అమెరికన్లు తల్లడిల్లుతున్నారు.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలోని సిటిజన్‌షిప్ క్లాజ్‌ను కూడా సుప్రీం కోర్టు ప్రస్తావించింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న విదేశీయుల పిల్లలు అక్కడ జన్మించినా వారికి కూడా జన్మతః పౌరసత్వం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, గతంలో ఇచ్చిన యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్ కేసు తీర్పును కూడా ఆధారంగా తీసుకుంది. ఆ తీర్పులో విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వ హక్కు ఉంటుందని ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన వలస విధానానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అక్రమ వలసలను అరికట్టడం, బర్త్ టూరిజంకు ముగింపు పలకడం తన రెండో విడత పాలనలో ప్రధాన లక్ష్యమని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అమెరికాకు వచ్చి పిల్లలకు జన్మనిచ్చి పౌరసత్వం పొందే విధానాన్ని నిలిపివేయాలన్నదే తన ఉద్దేశమని ఆయన గతంలో స్పష్టం చేశారు.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పును పౌర హక్కుల సంఘాలు, వలసదారుల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు స్వాగతించాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ సలహాదారుగా పనిచేసిన అజయ్ భుటోరియా ఈ తీర్పును చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఇది అమెరికా రాజ్యాంగానికి, న్యాయానికి, అమెరికన్ డ్రీమ్‌కు లభించిన గొప్ప విజయమని అన్నారు. 14వ రాజ్యాంగ సవరణను పరిరక్షించడం ద్వారా పిల్లల హక్కులను కాపాడినట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. దక్షిణాసియా దేశాల నుంచి వెళ్లిన వలస కుటుంబాలు సహా కోట్లాది మంది వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, సామాజిక అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డారనేది కాదనలేని సత్యం. అమెరికా 250 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకునే వేళ ఈ తీర్పు దేశ రాజ్యాంగ విలువలను మరోసారి బలపరిచిందన్నారు. తల్లిదండ్రుల వలస హోదా కారణంగా పిల్లల భవిష్యత్తు నిర్ణయించబడదని, అమెరికా సమాన అవకాశాల దేశంగానే కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు 14వ సవరణను వేరే కోణంలో అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. అమెరికాలో శాశ్వతంగా నివసించే ఉద్దేశం ఉన్నవారికే జన్మతః పౌరసత్వం వర్తించాలని వాదించారు. అయితే సుప్రీం కోర్టు ఆ వాదనను అంగీకరించలేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వ హక్కు వర్తిస్తుందని తేల్చిచెప్పింది.