Reading Time: < 1 minute
Hyderabad Brics Trade Unions Summit

BRICS Trade Unions Summit : అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ (BRICS) దేశాల ట్రేడ్ యూనియన్స్ ఫోరమ్ సమ్మిట్‌కు ఈసారి భాగ్యనగరం వేదిక కానుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన సమ్మిట్ సచివాలయాన్ని హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్రోడ్స్​‍లో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్రముఖ ‘హోటల్‌ మారియట్‌’లో ఈ సమ్మిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ సదస్సుకు బ్రెజిల్‌, రష్యా, చైనా, భారత్‌, సౌత్ ఆఫ్రికా సహా సుమారు 14 దేశాల నుంచి 50 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, అలాగే మన దేశం నలుమూలల నుంచి దాదాపు 70 మంది జాతీయ కార్మిక సంఘాల అగ్రనేతలు హాజరు కానున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కార్మిక, సాంకేతిక రంగాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు రోజుల సమ్మిట్‌లో ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరపనున్నారు. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు పని విధానంతో పాటు అట్టడుగు వర్గాల కార్మికులకు సైతం సామాజిక భద్రత కల్పించడంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. వీటితో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పని ప్రపంచానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించడం , ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) వంటి మానవ కేంద్రీత సాంకేతికత మానవాళికి ఏ విధంగా సహాయకారిగా ఉపయోగపడాలనే అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.