Reading Time: 2 minutes

సోలార్ పెట్టినా తప్పని కరెంట్ బిల్లు కష్టాలు: ఒకే రాష్ట్రం.. రెండు నిబంధనలా?

Caption of Image.

ప్రభుత్వం సోలార్ విద్యుత్ వాడకంపై ఎంత ప్రచారం చేస్తున్నా, ఆచరణలో మాత్రం వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సొంతంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి.. కరెంట్ బిల్లులు తగ్గించుకోవడమే కాకుండా అదనపు ఆదాయం పొందండి అని ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మి చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేసి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, స్కూళ్లు ఇలా అందరూ సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, తీరా ప్లాంట్లు పెట్టాక ప్రభుత్వం చెబుతున్న లబ్ధి తమకు అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు సమస్య ఏమిటి?
మనం తయారు చేసే విద్యుత్తుకు ఒక ధర, మనం వాడుకునే విద్యుత్తుకు ఎక్కువ రేటుకి మరో ధర  నిర్ణయించి విద్యుత్ సంస్థలు బిల్లులు వేస్తున్నాయి. దీనివల్ల లక్షలు పెట్టి సోలార్ పెట్టినా, నెలకు మళ్ళీ వేల రూపాయల బిల్లు కట్టాల్సి వస్తోంది. దీంతో వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

నెట్ మీటరింగ్ అంటే ఏంటి
నెట్ మీటరింగ్ అనేది సోలార్ వాడుకునే వారికి ఒక గొప్ప వరం. ఇది ఎలా పనిచేస్తుందంటే… పగటి పూట సోలార్ ప్యానెల్స్ ద్వారా తయారైన విద్యుత్తును మనం వాడుకోగా, మిగిలిన అదనపు విద్యుత్ ప్రభుత్వ గ్రిడ్‌కు వెళ్తుంది. రాత్రి పూట ఎండ ఉండదు కాబట్టి, మనం గ్రిడ్ నుండి విద్యుత్ తీసుకుంటాం. బిల్లు లెక్కింపులో  మనం ప్రభుత్వానికి ఇచ్చిన విద్యుత్, మనం వాడుకున్న విద్యుత్ రెండింటినీ లెక్కించి.. ఆ రెండింటి మధ్య ఉన్న తేడాకు మాత్రమే బిల్లు వేస్తారు. దీనినే ‘నికర’ (Net) వినియోగం అంటారు. ఈ విధానం వల్ల కరెంట్ బిల్లు 50 నుండి 100 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి కూడా త్వరగా వెనక్కి వస్తుంది.

ఒకే రాష్ట్రం.. రెండు వేర్వేరు రూల్స్
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య నిబంధనలు వేర్వేరుగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. EPDCCL (ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్) ఈ పరిధిలో నెట్ మీటరింగ్ విధానం పక్కాగా అమలవుతోంది, అక్కడి వినియోగదారులకు లబ్ధి చేకూరుతోంది. CPDCCL (సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్) మాత్రం అధికారులు నెట్ మీటరింగ్ సరిగ్గా అమలు చేయకుండా, వినియోగదారుల నుండి భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారు. ఒకే రాష్ట్రంలో ఉంటూ ఒక ప్రాంతానికి ఒక రూల్, మరో ప్రాంతానికి మరో రూల్ ఉండటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీపీడీసీఎల్ పరిధిలో కూడా నెట్ మీటరింగ్ అమలు చేసి తమకు న్యాయం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

సత్తెనపల్లిలోని ఒక వ్యక్తి సోలార్ ప్లాంట్ ద్వారా 1,267 యూనిట్ల కరెంటును తయారు చేశారు. అలాగే ఆయన మొత్తం 1,468 యూనిట్లు వాడుకున్నారు. ఆయన వాడుకున్న దానిలో నుంచి తయారు చేసిన కరెంటును తీసివేస్తే, కేవలం 201 యూనిట్లకు మాత్రమే బిల్లు కట్టాలి. అధికారులు మాత్రం ఆయన వాడుకున్న మొత్తం (1,468) యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.11.34 చొప్పున వేసి మొత్తం రూ.17,310 బిల్లు వేశారు. ఆయన తయారు చేసిన విద్యుత్తుకు మాత్రం యూనిట్‌కు కేవలం రూ.2.09 చొప్పున లెక్కగట్టి రూ.2,464 మాత్రమే తగ్గించారు. ఫలితంగా సోలార్ ప్లాంట్ ఉన్నా కూడా ఆయన ఏకంగా రూ.14,846 బిల్లు కట్టాల్సి వచ్చింది.

ఈస్ట్రన్ పవర్ పరిధిలోని ఎం. నాగులపల్లిలో  మరో వినియోగదారుడు తన సోలార్ ప్లాంట్ ద్వారా 2,160 యూనిట్లు తయారు చేశారు. ఆయన వాడుకున్నది మాత్రం 1,580 యూనిట్లు మాత్రమే. కానీ ఆయన వాడుకున్న దానికంటే 580 యూనిట్లు ఎక్కువే తయారు చేశారు.  ఆయన అదనంగా తయారు చేసిన 580 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.09 చొప్పున రూ.1,212 ఆయన ఖాతాలో జమ చేశారు. ఫలితంగా ఫిక్స్‌డ్ చార్జీలు అన్నీ కలిపి రూ.2,688 బిల్లు రాగా, అందులో నుంచి ఆయనకు రావాల్సిన రూ.1,212 తగ్గించి.. రూ.1,475 వసూలు చేశారు.

©️ VIL Media Pvt Ltd.