Reading Time: < 1 minute
Tmc Rebels Take Over Party Headquarters Kolkata Mamata Ritabrata Row

TMC: మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంక్షోభం మరింత తీవ్రమైంది. టీఎంసీకి చెందిన రీటబ్రత వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆక్రమించుకుంది. రీటబ్రత బెనర్జీ కార్యాలయానికి తాళం వేసి, తాళాలు తీసుకెళ్లారు. తమదే నిజమైన టీఎంసీ అని ఆ వర్గం నేతలు ప్రకటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్‌లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. రీటబ్రత వర్గం నేతలు తమదే నిజమైన టీఎంసీ అంటూ పార్టీ కార్యాలయం ముందు పోస్టర్లు అంటించారు.

శుక్రవారం రీటబ్రత బెనర్జీ, ఫిర్హాద్ హకీం, సందీపన్ సాహా, జావేద్ ఖాన్, అఖ్రుజ్జమాన్, పలువురు ఇతర నాయకులు మెట్రోపాలిటన్ ఈఎం బైపాస్‌లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ప్రధాన ద్వారా వద్ద మమతా బెనర్జీ, అరూప్ రాయ్‌ల చిత్రాలతో కూడా ఒక పోస్టర్ కూడా ఏర్పాటు చేశారు. రీటబ్రత వర్గం ఇటీవల మమతను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అరూప్ రాయ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించుకుంది. ఈ వర్గం మమతా బెనర్జీని తమ సలహాదారుగా పేర్కొంటోంది. సమావేశం తర్వాత పార్టీ కార్యాలయ తాళాలను రీటబ్రత వర్గం తమ వెంట తీసుకెళ్లారు.

ఈ పరిణామాలపై మమత వర్గం తీవ్రంగా స్పందించింది. తిరుగుబాటు నేతలకు పార్టీ కార్యాలయంతో ఎలాంటి సంబంధం లేదని, వారి వాదనలకు చట్టబద్ధత లేదని ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపిస్తూ, చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తులకు ఎన్నికల సంఘం ఎలా అపాయింట్మెంట్ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, అసలైన టీఎంసీ ఎవరిదనే వాదనల నేపథ్యంంలో ఎన్నికల సంఘం ఇరు వర్గాలను జూలై 6 సాయంత్రం లోగా పత్రాలను, వాదనల్ని సమర్పించాలని ఆదేశించింది.