Reading Time: 2 minutes
Japan Earthquake Tsunami Alert Magnitude 7 5

Japan Tsunami Warning: ఉత్తర జపాన్‌లో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. భూకంపం ధాటికి సముద్ర తీర ప్రాంతాలు ఒక్కసారిగా వణికిపోయాయి. భూకంపం అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జపాన్ ప్రధాని సనాయే తకైచి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

READ ALSO: Anasuya Bharadwaj : అసభ్య పోస్టులతో అనసూయకు వేధింపులు: యువకుడి అరెస్ట్ !

తీరానికి చేరుకున్న సునామీ తరంగాలు
జపాన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సాన్రికు తీరానికి సమీపంలో భూమి కంపించింది. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం వచ్చిన కొద్దిసేపటికే ఇవాటే ప్రాంతంలోని కుజీ ఓడరేవు వద్ద 80 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలకు దాదాపు 10 అడుగుల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంపం కారణంగా జపాన్‌లో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా టోక్యో – షిన్-అఒమోరి మధ్య నడిచే తోహోకు షింకన్సెన్ బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు. యమగాటా, అకితా షింకన్సెన్ సేవలు కూడా నిలిచిపోయాయి. అలాగే ఇవాటే ప్రాంతంలోని అన్ని లోకల్ రైళ్లను నిలిపివేశారు. హోక్కైడోలో కూడా కొన్ని రైలు మార్గాలు మూతపడ్డాయి. షిన్-చిటోస్, సెండాయ్ విమానాశ్రయాల కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు స్పష్టం చేశారు.

‘మెగా భూకంపం’ భయం భయం..
తాజా భూకంపంతో జపాన్‌లో ‘మెగా భూకంపం’ రాబోతుందా? అనే చర్చ మొదలైంది. రిక్టరు స్కేలుపై 8.0 అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలను మెగా భూకంపాలుగా పరిగణిస్తారు. జపాన్ భౌగోళికంగా పసిఫిక్, ఫిలిప్పీన్ సీ, యురేషియన్, నార్త్ అమెరికన్ అనే నాలుగు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉండటంతో ఇక్కడ భూకంపాలు తరచుగా వస్తుంటాయి. రాబోయే 30 ఏళ్లలో భారీ భూకంపం వచ్చే అవకాశం 70 శాతం ఉందని గతంలోనే అంచనాలు వెలువడ్డాయి. గతంలో డిసెంబర్ 2023 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపంలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. అలాగే మార్చి 11, 2011 జపాన్ చరిత్రలో అత్యంత భయంకరమైన 9.0 తీవ్రత భూకంపం వచ్చింది. సునామీ వల్ల 22,000 మందికి పైగా మరణించారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం అధికారులు తీర ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రాబోయే వారం రోజుల పాటు ‘ఆఫ్టర్ షాక్స్’ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

READ ALSO: Vaazha 2: మలయాళ సెన్సేషన్ ‘వాలా 2’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..