Reading Time: 2 minutes
Hardik Pandya Captaincy Under Pressure As Mumbai Indians Struggle In Ipl 2026

Hardik Pandya Captaincy: ఎంతో మంది స్టార్‌ ప్లేయర్స్‌ ఉన్నా.. ఈ ఐపీఎల్‌లో ముంబై జట్టు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు.. తొలి మ్యాచ్‌లో విజయంతో బోణీ కొట్టినా ముంబై జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటములు మూఠగట్టుకుంది.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌ జట్టు ఐపీఎల్ 2026లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తుండటంతో, అతని కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటంతో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో హార్దిక్ నాయకత్వంపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఓటమిపాలైంది. జట్టు బౌలింగ్ విభాగం అత్యంత బలహీనంగా మారింది. ఐదు మ్యాచ్‌ల్లో 972 పరుగులు ఇచ్చేసిన ముంబై బౌలర్లు 10.26 ఎకానమీ రేటుతో పరుగులను అడ్డుకోలేకపోతున్నారు. వికెట్లు తీయడంలోనూ విఫలమవడంతో జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 81 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్, బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఒక మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైనప్పటికీ, అతని నుంచి మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హార్దిక్‌పై తీవ్ర విమర్శలు..
అయితే, మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. హార్దిక్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, “హార్దిక్ చివరిసారిగా ఒంటరిగా మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడాడో గుర్తులేదు. చిన్న చిన్న మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.. కానీ, జట్టును గెలిపించే 70-80 పరుగుల ఇన్నింగ్స్‌లు కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. జట్టు కొత్త ఆలోచనా విధానం, నిర్భయమైన ఆటతీరు అలవరుచుకోవాలని కూడా సూచించారు.

రోహిత్‌ శర్ము పగ్గాలు ఇవ్వాలి..!
ఇక, హార్దిక్ కెప్టెన్సీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ మనోజ్‌ తివారీ మాట్లాడుతూ, ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌ శర్మను మళ్లీ కెప్టెన్‌గా నియమించాలని సూచించారు. జట్టులో స్థిరత్వం తీసుకురావాలంటే రోహిత్ నాయకత్వమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జట్టు వైఫల్యానికి పూర్తిగా హార్దిక్‌ను మాత్రమే బాధ్యుడిగా చేయడం సరైంది కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం వరుసగా విఫలమవుతుండటం, భారీ స్కోర్లను కాపాడుకోలేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. దీంతో బ్యాట్స్‌మెన్‌పై అదనపు ఒత్తిడి పడుతోంది. అయినప్పటికీ కెప్టెన్‌గా, సీనియర్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర ఎంతో కీలకం. అతను త్వరలోనే ఒక భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపిస్తాడా? లేక కెప్టెన్సీపై మరింత ఒత్తిడి పెరుగుతుందా? అన్నది ఇప్పుడు ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.