Reading Time: 2 minutes
Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Cameron Green Six Tata Sierra Car Dent: కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం ముప్పై రెండు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కమెరాన్ గ్రీన్ బాధ్యతాయుతంగా ఆడి తన జట్టును ఆదుకున్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను, సరైన సమయంలో గేరు మార్చాడు. యాభై ఐదు బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో డెభ్భై తొమ్మిది పరుగులు సాధించి ఈ సీజన్‌లోనే తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.

టాటా సియెర్రా కారుకు డ్యామేజ్..

12వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకు వచ్చి గ్రీన్ ఒక భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత 13వ ఓవర్లో అశోక్ శర్మ బౌలింగ్ లో మరింత రెచ్చిపోయాడు. ఆ ఓవర్ మూడవ బంతిని బలంగా గాల్లోకి లేపడంతో, ఆ బంతి నేరుగా వెళ్లి మైదానంలో ప్రదర్శనకు ఉంచిన టాటా సియెర్రా కారును బలంగా తాకింది. ఈ దెబ్బకు కారు పైభాగంలో సొట్ట పడింది. బ్యాటర్లు కొట్టిన బంతి నేరుగా కారుకు తగలడం క్రికెట్ మైదానంలో చాలా అరుదుగా జరుగుతుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ అధికారిక ఖాతా కూడా ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది.

కారును బంతి తాకితే ఏం జరుగుతుంది?

స్టేడియంలో ఉంచిన కారు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాదు. లీగ్ ప్రధాన స్పాన్సర్ అయిన టాటా సంస్థ ఒక ప్రత్యేక నిబంధన అమలు చేస్తోంది. ఆటగాడు కొట్టిన సిక్సర్ నేరుగా వెళ్లి కారు అద్దాన్ని పగలగొడితే, లేదా సొట్ట పడితే ఆ సంస్థ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంది లేదా గ్రామీణ యువతకు క్రికెట్ కిట్లను అందజేస్తుంది. అయితే గ్రీన్ కొట్టిన బంతికి అద్దం పగలలేదు, కేవలం సొట్ట మాత్రమే పడింది. కాబట్టి కేవలం రూ. 5 లక్షలు అందించనున్నారు. గతంలో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లు కూడా ఇలాగే కారును లక్ష్యంగా చేసుకుని విరాళాలు అందేలా చేశారు.

చివర్లో తడబడిన కోల్‌కతా నైట్ రైడర్స్..

పదిహేను ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి నూట నలభై ఎనిమిది పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. గ్రీన్ కూడా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, చివరి ఐదు ఓవర్లలో కేవలం ముప్పై రెండు పరుగులు మాత్రమే చేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయారు. కమెరాన్ గ్రీన్ చివరి బంతి వరకు క్రీజులో ఉన్నప్పటికీ, ఎక్కువ బంతులు ఆడేలా స్ట్రైకింగ్ తన వద్దే ఉంచుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. దీంతో కోల్‌కతా జట్టు నిర్ణీత ఓవర్లలో 180 పరుగులకే పరిమితమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..