
తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని డీజీపీ సీ.వీ. ఆనంద్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత రెండు నెలలుగా ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, అందులో జరిగే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అయితే 44వ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని… రోడ్లపై అక్రమ పార్కింగ్ వల్లే ఈ ఘోరాలు జరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందని డీజీపీ వెల్లడించారు. ప్రమాదాల నియంత్రణ అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని… ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాహనదారులు డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవర్చుకోవాలని, వేగాన్ని నియంత్రించుకుంటూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మహమ్మారిపై డీజీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి ఇప్పుడు గ్రామాల్లోకి కూడా విస్తరిస్తోందని… దీని నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంజాబ్ రాష్ట్రం తరహాలో తెలంగాణ యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దని హితవు పలికారు. భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో గంజాయి ఎక్కువగా సాగు చేస్తున్నట్లు గుర్తించామని… గంజాయి సాగు చేసిన 110 మంది రైతులకు ఇప్పటికే రైతు భరోసా నిలిపివేసినట్లు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
►ALSO READ | హైదరాబాద్ లో భారీ వర్షానికి.. కోఠి ENT హాస్పిటల్లో వర్షపునీరు… బురద, మురుగు వాసనతో రోగులు పరేషాన్…
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా పోలీసుల పనితీరును డీజీపీ అభినందించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడి పోలీసులపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, వారు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అవలంబించాలని… అదే సమయంలో నేరగాళ్లు, గూండాలకు పోలీస్ అంటే వణుకు పుట్టేలా స్ట్రాంగ్ పోలీసింగ్ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతరించిందని డీజీపీ సీ.వీ. ఆనంద్ ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నక్సలైట్ల అలజడి తగ్గడంతో గ్రేహౌండ్స్ ఫోర్స్‌ను కొంతమేర తగ్గిస్తున్నామని… అలా తగ్గించిన గ్రేహౌండ్స్ సిబ్బందిని ఇకపై రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణ కోసం, అలాగే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం సమర్థవంతంగా వినియోగించుకుంటామని డీజీపీ వెల్లడించారు.