Reading Time: 2 minutes

వామ్మో.. స్కూల్ ట్రిప్‌కు రెండున్నర లక్షలా? ఇది చదువా లేక లగ్జరీ బిజినెసా అంటున్న పేరెంట్స్!

Caption of Image.

ఈ రోజుల్లో చదువుతో పాటు ఎక్స్‌పోజర్ కూడా చాలా అవసరమని ప్రైవేట్ స్కూళ్లు చెప్తుంటాయి. ఆ ఎక్స్‌పోజర్ కోసం అయ్యే ఖర్చు వింటేనే సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల గుండె ఆగిపోతోంది. అల్కా గుర్హా అనే మహిళ పెట్టిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన స్నేహితురాలి కొడుకు 8వ తరగతి చదువుతున్నాడని, స్కూల్ వాళ్లు వేసిన జపాన్ ట్రిప్ కోసం ఏకంగా రూ.2లక్షల 50వేలు చెల్లించాల్సి వచ్చిందని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు అక్కడ షాపింగ్ ఖర్చుల కోసం అదనంగా మరో రూ.50వేలు ఇచ్చినట్లు చెప్పటంతో సోషల్ మీడియా యూజర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ జపాన్ ట్రిప్ స్టోరీ అంతటితో ముగిసిపోలేదు. అదే పిల్లోడు కొన్ని నెలల క్రితమే గోవా స్కూల్ ట్రిప్ కోసం రూ.90వేలు ఖర్చు చేశాడట. కేవలం కొద్దిరోజుల విహారయాత్రలకే ఈ స్థాయిలో లక్షల రూపాయలు గుంజేస్తుండటంతో.. అసలు ఇది చదువా లేక లగ్జరీ బిజినెసా అంటూ నెటిజన్లు ప్రైవేటు స్కూళ్లపై ఫైర్ అవుతున్నారు. ఈ జపాన్ ట్రిప్ ఖరీదు ఎంతలా ఉందంటే.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలల నెట్‌వర్క్ అయిన కేంద్రీయ విద్యాలయ ఫీజులతో పోలిస్తే ఇది ఒక భారీ రికార్డుగా నిలుస్తుంది. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుండి 8వ తరగతి వరకు ట్యూషన్ ఫీజు ఉండదు. కేవలం కంప్యూటర్ ఫండ్, వికాస్ నిధి లాంటివి కలిపి ఏడాదికి రూ.8వేల నుంచి రూ.10వేలు మాత్రమే అవుతుంది. అంటే ఒక పిల్లోడి జపాన్ ట్రిప్ ఖర్చుతో ఒక కేవీ స్టూడెంట్ ఏకంగా 25 నుండి 30 సంవత్సరాల పాటు చదువుకోవచ్చన్నమాట.

ప్రస్తుతం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు సింగపూర్, యూరప్, అమెరికా, జపాన్ వంటి దేశాలను తమ యాన్యువల్ క్యాలెండర్‌లో చేర్చేస్తున్నాయి. విదేశీ సంస్కృతిని తెలుసుకోవడం, అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ పెంచుకోవడం వంటివి పిల్లల ఆత్మవిశ్వాసానికి మంచివే అయినప్పటికీ.. వాటికి అయ్యే ఫ్లైట్ టికెట్లు, ఇన్సూరెన్స్, హోటల్ స్టే పేరుతో పేరెంట్స్ జేబులకు చిల్లులు పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకైతే.. ఈ ట్రిప్ ఖర్చులు వారి స్కూల్ ఫీజులను కూడా దాటేస్తున్నాయట.

ఈ ట్రెండ్ వల్ల స్కూళ్లలో పిల్లల మధ్య ఒకరకమైన అసమానతలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతున్నాయని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. డబ్బున్న వాళ్ల పిల్లలు విదేశీ ట్రిప్‌లకు వెళ్తుంటే.. అంత ఫీజు భరించలేని పేరెంట్స్ పిల్లలు స్కూల్లో ఒంటరిగా ఫీలవ్వాల్సి వస్తోందట. చదువు అనేది అందరికీ సమానమైన అవకాశాలను ఇవ్వాలి కానీ.. ఇలాంటి ఖరీదైన ట్రిప్‌ల వల్ల తరగతి గదిలోనే పేద, ధనిక అనే తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. విద్యాసంస్థలు నేర్పే పాఠాలు జ్ఞానాన్ని పంచేలా ఉండాలే తప్ప ఇలాంటి విలాసవంతమైన టూర్లతో తల్లిదండ్రులను మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురిచేయకూడదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.