Reading Time: < 1 minute
India Women Suffer Defeat To England In T20 World Cup 2026 Warm Up Match Despite Richa Ghoshs Heroics

Ind W vs Eng W: మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌ లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు లక్ష్యానికి చేరువైనప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ అమీ జోన్స్ 45 బంతుల్లో 64 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించగా, కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో డానీ గిబ్సన్ కేవలం 12 బంతుల్లో 30 పరుగులు చేసి వేగంగా ఆడి స్కోరును పరుగులు పెట్టించింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు పడగొట్టగా, రెణుకా సింగ్, రాధా యాదవ్, శ్రీ చరణి, షెఫాలీ వర్మ తలో వికెట్ తీశారు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన (1), షెఫాలీ వర్మ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వచ్చిన యస్తిక భాటియా (15), హర్మన్‌ప్రీత్ కౌర్ (17), భారతి ఫుల్మాలి (18) కూడా పెద్దగా రాణించలేకపోయారు. అయితే వికెట్ కీపర్ కం బ్యాటర్ రిచా ఘోష్ ఒంటరి పోరాటం చేసింది. ఆమె 36 బంతుల్లో 68 పరుగులు చేసి ఆశలను సజీవంగా ఉంచింది. ఆమెకు రాధా యాదవ్ 16 పరుగులతో సహకరించినా.. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ మూడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీయగా, డానీ గిబ్సన్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్ చెరో రెండు వికెట్లు సాధించారు.

ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఈ వార్మప్ మ్యాచ్‌లో ఓటమి పాలవడం టీమిండియాకు హెచ్చరికగా మారింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం, డెత్ ఓవర్లలో వికెట్ల పతనం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్, కొందరు యువ ఆటగాళ్ల పోరాటం మాత్రం భారత జట్టుకు సానుకూల అంశాలుగా నిలిచాయి.