Reading Time: 2 minutes

ఇథనాల్ బ్లెండింగ్‌పై మోడీ సర్కార్ యూటర్న్ తీసుకుంటోందా..? వాహనదారులకు కొత్త ఆఫర్..

Caption of Image.

పాత పెట్రోల్ కార్లు, బైక్‌లు వాడుతున్నారా? అయితే ఈ క్రేజీ అప్‌డేట్ మీ కోసమే. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం గురించి మోడీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని తప్పనిసరి చేసిన సర్కార్.. ఇప్పుడు ఆ బ్లెండింగ్‌ను 25 శాతానికి(E25) లేదా అంతకంటే ఎక్కువ పెంచే విషయాన్ని వెంటనే తప్పనిసరి చేయకూడదని భావిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఇథనాల్ శాతం పెంచితే ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న కోట్ల పాత వాహనాల ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం ఉండటమే.

పాత బండ్ల కథేంటి? ఎందుకు టెన్షన్?
నిజానికి 2012 నుంచి మార్చి 2023 లోపు తయారైన చాలా వాహనాలు కేవలం 10 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మాత్రమే తట్టుకోగలవు. ఏప్రిల్ 2023 తర్వాత వచ్చినవి E20కి సర్టిఫై అయినప్పటికీ.. పూర్తి స్థాయిలో E20 ఇంధనానికి తగినట్లుగా డిజైన్ చేసిన వాహనాలు కేవలం ఏప్రిల్ 2025 తర్వాతే మార్కెట్లోకి వచ్చాయి. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ గాల్లోని తేమను త్వరగా గ్రహిస్తుంది. దీనివల్ల పాత ఇంజన్లలోని రబ్బర్, మెటల్ పార్ట్స్ త్వరగా పాడైపోతాయి. అంతేకాదు ఇథనాల్ శాతం పెరిగేకొద్దీ ఇంధన సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రభుత్వం E25ని తప్పనిసరి చేస్తే.. పాత బండ్ల మైలేజ్ ఘోరంగా పడిపోవడమే కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపెడవుతాయి.

బండి ఇప్పుడే మార్చేయాలా? 
ఈ వార్త వినగానే మీ పాత బండిని ఇప్పుడే మార్చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం E25 పెట్రోల్ ని బలవంతంగా రుద్దడం లేదు. దీనికి బదులుగా భారత్ బ్రెజిల్ దేశం తరహా మోడల్‌ను అనుసరించే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో పెట్రోల్ బంకుల్లో ఒకే రకమైన పెట్రోల్ కాకుండా విభిన్న ఆప్షన్లు ఉంటాయి. సాధారణ పాత బండ్ల కోసం E20 డిస్పెన్సర్లు, కొత్తగా వచ్చే వాహనాల కోసం E25 లేదా E30 పెట్రోల్.. అలాగే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం E85 పెట్రోల్ డిస్పెన్సర్లను విడివిడిగా ఏర్పాటు చేస్తారు. వాహనదారులు తమ బండి ఇంజన్ కెపాసిటీని బట్టి ఏ పెట్రోల్ కొట్టించుకోవాలో వాళ్లే డిసైడ్ చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది.

ALSO READ : 10 రోజుల్లో 10 వేల రూపాయలు తగ్గిన బంగారం

ఈ ఇథనాల్ గందరగోళానికి ఒకే ఒక్క పరిష్కారం ‘ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్’ అని ఆటో నిపుణులు అంటున్నారు. ఈ వాహనాల్లో ఉండే ప్రత్యేక సెన్సార్లు పెట్రోల్‌లో ఇథనాల్ ఎంత శాతం ఉందో ఆటోమేటిక్‌గా గుర్తించి.. దానికి తగ్గట్టుగా ఇంజన్ ట్యూనింగ్‌ను మార్చేసుకుంటాయి. ఇవి నార్మల్ పెట్రోల్ నుంచి 85 శాతం ఇథనాల్ బ్లెండ్ వరకు దేనితోనైనా నడవగలవు. ఇప్పటికే మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజాలు ఇలాంటి సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బండ్లను మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించాయి. కొత్తగా బండి కొనేవారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవటం బెటర్. 

©️ VIL Media Pvt Ltd.