
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందించింది. న్యూస్ పేపర్లో , టీవీల్లో వచ్చిన వార్తలను బట్టి కమిషన్ స్వయంగా (సుమోటోగా) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
దంటే అసలు ఏం జరిగిందంటే
2026 జూన్ 8న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఒక పేలుడులో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు కార్మికులు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్లాంట్‌లోని ‘స్టీల్ మెల్టింగ్ షాప్’లో దాదాపు 1600°C వేడితో ఉన్న 150 టన్నుల కరిగించిన ఇనుమును తీసుకువెళ్తున్న ఒక పెద్ద పాత్ర అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో ఆ ఉడుకుతున్న కరిగించిన ఉక్కు కింద పడటంతో కార్మికులకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భద్రతా నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు
ఈ ఘోర ప్రమాదంపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి (Chief Secretary) కమిషన్ నోటీసులు పంపింది. ఈ నివేదికలో గాయపడిన కార్మికులకు అందుతున్న వైద్యం, వారి ఆరోగ్య పరిస్థితి…. చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం ఇంకా యాజమాన్యం ప్రకటించిన నష్టపరిహారం (ఎక్స్ గ్రేషియా) వివరాలు ఉండాలని స్పష్టం చేసింది.
ALSO READ : రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర
మళ్లీ తృటిలో తప్పిన ప్రమాదం
ఈ దారుణం జరిగిన కొన్ని రోజులకే, గురువారం తెల్లవారుజామున ప్లాంట్‌లోని అదే విభాగంలో (SMS-1) మరో ప్రమాదం జరిగింది. అక్కడ ఉడుకుతున్న కరిగిన ఉక్కు.. పాత్ర నుండి కింద ఒలికిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలతో కార్మికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.