
విశాఖ స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఎస్ఎంఎస్-1 (SMS-1) సీసీడీ విభాగంలో జరిగిన భారీ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మరణించిన ఘటన మరవకముందే.. మరో ప్రమాదం జరిగింది. గురువారం (జూన్ 11) ఉదయం ఎస్ఎంఎస్-1 టిపిబే (TP Bay) విభాగంలో మరో ప్రమాదం సంభవించింది. లాడిల్ కు రంద్రం పడి ఉక్కు ద్రవం నేలపాలైంది. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు, సిబ్బంది పరుగులు తీశారు.
ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ల్యాడిల్‌కు రంధ్రం పడటంతో వేడి స్టీల్ మెటల్ ద్రవం భారీగా నేలపాలైంది. సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరుగులు తీశారు. అంతకు ముందు బుధవారం ఎస్ఎంఎస్-2 విభాగంలో ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రవం కిందపడి నేలపాలైన ఘటన తర్వాత.. ఇవాళ మరోసారి ప్రమాదం జరగటం గమనార్హం.
ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై కేంద్రం నియమించిన త్రీమెన్ కమిటీ ప్రస్తుతం విచారణ జరుపుతుండగానే, మళ్లీ ఇలా వరుసగా రెండు రోజులు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ వరుస ఘటనలతో ఉక్కు ఉద్యోగులు, కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం (జూన్ 08) ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్లాంట్‌లోని అత్యంత కీలకమైన స్టీల్ మెల్టింగ్ షాప్-1 (ఎస్ఎంఎస్ 1) విభాగంలో ప్రమాదం జరిగింది. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన లిక్విడ్ ఐరన్ ను తరలిస్తున్న క్రేన్ ల్యాడెల్ ఒక్కసారిగా తెగి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
వందల టన్నుల లిక్విడ్ ఐరన్ నేలపై ఒలికిపోవడంతో ప్లాంట్ ప్రాంగణం క్షణాల్లో అగ్ని గుండంలా మారింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు మృతిచెందారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.