
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్లి ప్రాంతంలో ఒక విలాసవంతమైన నివాస గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ డీల్‌కు సంబంధించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను స్క్వేర్ యార్డ్స్ సంస్థ పరిశీలించి వివరాలను వెల్లడించింది. వర్లిలోని ప్రముఖ ‘ఆర్టేసియా’ ప్రాజెక్ట్‌లో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,875 చదరపు అడుగులు. 2026 జూన్ నెలలో ఈ ఇంటి అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఒప్పందంలో భాగంగా అయ్యర్‌కు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా లభించాయి. ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ. 1.84 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగా.. ఏకంగా రూ. 74 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా జమ చేశారు.
ఈ అద్దె ఒప్పందం మొత్తం 36 నెలల కాలపరిమితికి కుదిరింది. ఒప్పందం ప్రకారం మొదటి ఏడాది నెలవారీ అద్దె రూ. 18.50 లక్షలుగా ఉంటుంది. రెండో ఏడాదిలో ఈ అద్దె దాదాపు 7 శాతం పెరిగి రూ. 19.79 లక్షలకు చేరుకుంటుంది. ఇక మూడో ఏడాదిలో మరో 7 శాతం పెరిగి నెలకు రూ. 21.18 లక్షలుగా మారుతుంది. ఈ రకంగా లెక్కిస్తే మూడేళ్ల కాలపరిమితిలో శ్రేయస్ అయ్యర్ చెల్లించే మొత్తం అద్దె విలువ అక్షరాలా రూ. 7.14 కోట్లు కావడం విశేషం. ముంబైలో వర్లి ప్రాంతం అత్యంత విలాసవంతమైన నివాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇక్కడి నుంచి బీకేసీ, నారిమన్ పాయింట్, లోయర్ పరేల్ వంటి ప్రధాన వ్యాపార కేంద్రాలకు, అలాగే బాంద్రా-వర్లి సీ లింక్ ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యం చాలా సులభంగా ఉంటుంది.
భారత జట్టులో అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్, ఇటీవల సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత పురుషుల టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. అలాగే భారత్ ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలోనూ ముఖ్య భూమిక పోషించారు. ఐపీఎల్‌లోనూ అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు ఉన్న అయ్యర్, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపారు. ఆ తర్వాతి ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టును రన్నరప్‌గా ఫైనల్‌కు చేర్చారు. ఆన్-ఫీల్డ్‌లోనే కాకుండా ఆఫ్-ఫీల్డ్‌లోనూ తన లైఫ్‌స్టైల్‌తో ఆయన ఇప్పుడు వార్తల్లో నిలిచారు.