Reading Time: < 1 minute
Moral Story: ఓపిక ఉన్నవాడిదే లోకం..! తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!

జీవితంలో విజయం సాధించడానికి తెలివితేటలు, కష్టపడే తత్వం ఎంత ముఖ్యమో, ఓర్పు, సహనం కూడా అంతే అవసరం. అందుకే మన పెద్దలు సహనమే సర్వభూషణం, నిదానమే ప్రధానం అనే సందేశాలను ఎప్పుడో ఇచ్చారు. పెద్దలు ఇచ్చిన ఈ సందేశం నేటి వేగవంతమైన జీవితంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓర్పు, సహనం గొప్పతనాన్ని తెలిపే ఓ నీతి కథను ఇప్పుడు చూద్దాం..

కథ

ఒక గ్రామంలో రామనాథం అనే వ్యాపారి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివ తెలివైనవాడు కానీ ముక్కు మీద కోపం ఉండేది. చిన్న కుమారుడు హరి మాత్రం ప్రశాంత స్వభావం, ఓర్పుతో వ్యవహరించేవాడు. తమ వ్యాపారానికి సరైన వారసుడు ఎవరో తెలుసుకోవడానికి రామనాథం ఇద్దరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. తాము పండించిన ముడి పత్తిని నగరానికి తీసుకెళ్లి, ఎక్కువ లాభంతో అమ్మి రావాలని వారిద్దరికీ చెప్పాడు.

నగరంలోని మార్కెట్‌కు మొదట వెళ్లిన శివ దగ్గరకు వచ్చిన కస్టమర్లు.. పత్తి నాణ్యత సరిగ్గా లేదంటూ ప్రశ్నలు వేయడంతో అతడు ఆవేశానికి గురయ్యాడు. వారి మాటలను అవమానంగా భావించి కోపంగా స్పందించాడు. ఫలితంగా కస్టమర్లు వెనక్కి తగ్గి శివ దగ్గర పత్తిని కొనుగోలు చేయకుండా వెళ్లిపోయారు. రోజంతా చూసి చివరికి శివ పత్తిని తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది.

మరుసటి రోజు మార్కెట్‌కు వెళ్లిన హరి మాత్రం అదే పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు. పత్తి నాణ్యతకు సంబంధించిన కస్టమర్ల సందేహాలను ఓపికగా విన్నాడు. పత్తి నాణ్యతను మర్యాదగా వివరించాడు. అతని వినయం, సహనం చూసి కస్టమర్లు ఆకర్షితులై మంచి ధరకు మొత్తం సరుకును కొనుగోలు చేశారు. దీంతో హరి అధిక లాభంతో ఇంటికి చేరుకున్నాడు.

నీతి

ఈ సంఘటన ద్వారా రామనాథం ఒక ముఖ్యమైన పాఠాన్ని తన కుమారులకు బోధించాడు. కోపం మనిషిని నష్టపరుస్తుంది. ఆవేశం సరైన నిర్ణయాలను తీసుకునే విచక్షణ శక్తిని తగ్గిస్తుంది. కానీ సహనం సరైన నిర్ణయాలు తీసుకునేలా చేసి మనల్ని విజయ మార్గంలో నడిపిస్తుంది. ఇతరుల విమర్శలను, కష్టాలను, ప్రతికూల పరిస్థితులను ఓర్పుతో ఎదుర్కొనే వ్యక్తే చివరికి విజేతగా నిలుస్తాడు.

అందుకే ఓపికతో ఉన్నవాడిదే లోకం. సహనం అనేది బలహీనత కాదు, జీవితాన్ని గెలిపించే గొప్ప ఆయుధం.