Reading Time: 2 minutes
Nasser Hussain Urges Ben Stokes Not To Retire After Nightclub Controversy

Nasser Hussain backed Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ అనంతరం నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న స్టోక్స్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రెండో టెస్ట్‌కు ఎంపిక చేయలేదు. ఈ ఘటనతో స్టోక్స్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చనే వార్తలు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా ఈ అంశంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ స్పందించాడు. భావోద్వేగాలకు లోనై రిటైర్మెంట్ వంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దని స్టోక్స్‌కు సూచించాడు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆటగాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆటకు వీడ్కోలు చెప్పడం బాధాకరమని అభిప్రాయపడ్డాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన హుస్సేన్.. ‘స్టోక్స్ ఎన్నో సందర్భాల్లో ఇంగ్లండ్‌కు అండగా నిలిచాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ విజయాల్లో అతని పాత్ర కీలకం. ఇంగ్లండ్ క్రికెట్‌కు స్టోక్స్ నిజమైన యోధుడు’ అని ప్రశంసించాడు.

అయితే నైట్‌క్లబ్ ఘటనలో బెన్ స్టోక్స్ తప్పు చేశాడని నాసర్ హుస్సేన్ స్పష్టం చేశాడు. ‘ఈసారి స్టోక్స్ తప్పు చేశాడు. అది చాలా పెద్ద తప్పే. కానీ అది కెరీర్‌ను ముగించే స్థాయి తప్పు కాదని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం స్టోక్స్ తీవ్ర నిరాశలో ఉండి ఉంటాడు. నేను అందరినీ నిరాశపరిచాను, ఇక రిటైర్ అవ్వాలి అనే భావోద్వేగ నిర్ణయం తీసుకోకూడదు’ అని సూచించాడు. స్టోక్స్ ప్రస్తుతం తన భవిష్యత్తుపై చిరకాల సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ఆటగాడు ఇలాంటి వివాదం మధ్య తన కెరీర్‌కు ముగింపు పలకడం సరైనది కాదని నాసర్ అభిప్రాయపడ్డాడు.

‘బెన్ స్టోక్స్ వంటి ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇలాంటి పరిస్థితుల్లో ఆటను వీడకూడదు. అతడు మరింత గౌరవప్రదమైన ముగింపుకు అర్హుడు. ఇది అతడి చివరి మ్యాచ్‌లలో ఒకటిగా మిగిలిపోకూడదని నేను ఆశిస్తున్నాను. స్టోక్స్ మళ్లీ బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని నాసర్ హుస్సేన్ చెప్పాడు. న్యూజిలాండ్‌తో జూన్ 17 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు స్టోక్స్ స్థానంలో జో రూట్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. విచారణ పూర్తయ్యే వరకు స్టోక్స్ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. అయితే ఇంగ్లండ్ అభిమానులు మాత్రం తమ స్టార్ ఆల్‌రౌండర్ మళ్లీ జట్టులోకి తిరిగి రావాలని ఆశిస్తున్నారు.