
భద్రాచలం, వెలుగు : ఏజెన్సీ ప్రాంత వైద్యంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, భద్రాచలం ఏరియా హాస్పిటల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి, ఇక్కడ అందుతున్న ట్రీట్‌మెంట్‌ను పరిశీలించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రాజశేఖర్‌రెడ్డితో సమావేశమై హాస్పిటల్ సమస్యలపై చర్చించారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌ఘడ్, ఒడిశా నుంచి నిత్యం సుమారు 400 మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారని, వైద్యం అందించాల్సిన చోట సగానికి పైగా ఖాళీలు ఉన్నాయని, ఖాళీలను భర్తీ చేయకుండా పాలకులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపించారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంపై అధ్యయనం చేస్తున్నామని, ఆగస్టులో హైదరాబాద్‌లో దీనిపై భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులున్నారు.