Reading Time: < 1 minute
Hyderabad Two Sisters Die After Falling Ill Post Consuming Mangoes Forensic Probe Underway

Hyderabad: హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. మృతులను భువనేశ్వరి (17), సంధ్య (10)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటి సమీపంలోని ఓ దుకాణం నుంచి మామిడి పండ్లు కొనుగోలు చేసి ఇద్దరు తిన్నారు. అనంతరం మరుసటి రోజు నుంచి వారికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ రెండు రోజుల వ్యవధిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. అదే రోజు, అదే దుకాణం నుంచి మరో ఆరుగురు సైతం మామిడి పండ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ పండ్ల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే అవకాశం ఉంది. ఆ ఆరుగురు ఆరోగ్య పరిస్థితిపై కూడా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, ఆరోగ్య శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.