Reading Time: 2 minutes
Digital Robots How Screen Addiction Is Changing Childhood And What Parents Can Do

Parenting Tips: ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు.. వీధులన్నీ పిల్లల కేరింతలతో, ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇళ్లల్లో అడుగుపెడితే నిశ్శబ్దం.. లేదా టీవీలు, స్మార్ట్‌ఫోన్ల సౌండ్లు. అవును, ప్రస్తుత తరం పిల్లలు యాంత్రికంగా మారిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు ‘డిజిటల్ రోబోలు’గా మారుతున్నారు. మరోవైపు, వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు తెరుచుకునే సమయం వచ్చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పునఃప్రారంభాన్ని ఈనెల 12వ తేదీకి బదులు జూన్ 15కి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల పెంపకం పట్ల తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

తల్లిదండ్రులు పిల్లలు స్కూల్స్‌లో చేర్పించి అంతా వాళ్లే చూసుకుంటారు లే అని చేతులు దులుపుకోవద్దు. ఇంట్లో కనీసం రోజుకు 1-2 గంటలు ఫోన్లు, టీవీలు పూర్తిగా బంద్ చేసి, పిల్లలతో మాట్లాడటానికి కేటాయించండి. సెలవు రోజుల్లో మాల్స్, సినిమా థియేటర్లకు కాకుండా.. పార్కులు, జూ, మ్యూజియంలు లేదా పల్లెటూళ్లకు తీసుకెళ్లండి. ప్రకృతితో వారిని మమేకం చేయండి. మీరు ఫోన్ చూస్తూ పిల్లలను చదువుకోమంటే వారు వినరు. పిల్లల ముందు డిజిటల్ డిటాక్స్ (Digital Detox) పాటించడం తల్లిదండ్రులుగా మీకూ అవసరమే. పిల్లలు భవిష్యత్తు భారత పౌరులు. వారు కేవలం మార్కులు సాధించే యంత్రాలు కాకూడదు; మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులుగా ఎదగాలి. జూన్ 15 నుంచి బడులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. వారి చేతికి ‘స్మార్ట్ ఫోన్’ కాదు, ‘ఆట బంతి’ని కూడా అందిద్దాం.

అలా చేయకపోతే పిల్లలకు జరిగేనష్టం ఏంటి?

పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోకపోవడం, రోజంతా స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక వికాసం కూడా దెబ్బతింటుంది. శారీరక సమస్యలు: వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం (Obesity), కంటి సమస్యలు, వెన్నునొప్పి వంటివి వస్తున్నాయి. నలుగురితో కలవడం, పంచుకోవడం (Sharing), స్నేహం చేయడం వంటి సామాజిక నైపుణ్యాలను (Social Skills) పిల్లలు కోల్పోతున్నారు. ఫోన్లలో హింసాత్మక గేములు ఆడటం వల్ల కోపం, మొండితనం, ఏకాగ్రత లోపించడం (ADHD లక్షణాలు) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సొంతంగా ఆలోచించే శక్తి తగ్గి, కేవలం స్క్రీన్ పై కనిపించే సమాచారాన్ని మాత్రమే గ్రహించే రోబోల్లా తయారవుతున్నారు. అందరూ ప్రతి తల్లిదండ్రుల బాధ్యతగా వ్యవహరించి మీ పిల్లల్ని కాపాడుకోండి.