Reading Time: < 1 minute
Tmc Faces Fresh Setback Sushmita Dev Resigns Rajya Sabha Mamata Banerjee

Sushmita Dev: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే బెంగాల్‌లో రెబెల్ నాయకుడు రితబ్రతా బెనర్జీ వెనుక ఏకంగా 61 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు చేరి తిరుగుబాటు జెండా ఎగరేయగా, ఇప్పుడు ఆ సెగ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌కు సైతం తాకింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడైన సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభకు రాజీనామా చేసిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే, మరో కీలక మహిళా నేత సుస్మితా దేవ్ సైతం తన రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.

సుస్మితా దేవ్ గతంలో అస్సాంలోని సిల్చార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే మమతా బెనర్జీ ఆమెకు జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు రాజ్యసభ సీటును సైతం ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. అయితే.. తాజాగా ఊహించని విధంగా, రాజ్యసభకు రాజీనామా చేసిన వెంటనే సుస్మితా దేవ్ ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ప్రస్తుతం అస్సాంలో ఉపఎన్నిక జరగబోయే ఓ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక, రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌కు పంపిన లేఖలో తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సుస్మితా కోరారు. తన రాజకీయ భవిష్యత్తు బెంగాల్‌లో కాదని, సొంత రాష్ట్రమైన అస్సాంలోనే ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక వ్యక్తిగత, రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్తూ.. ఒకసారి టీఎంసీ సభ్యత్వాన్ని వదులుకున్నాక ఆ పార్టీ కోటాలో వచ్చిన రాజ్యసభ సీటులో కొనసాగడం ధర్మం కాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే మమతా బెనర్జీపై ఎలాంటి విమర్శలు చేయడానికి నిరాకరించారు.