Reading Time: < 1 minute
గుండెల్ని పిండేసే దీనస్థితి.. ఎద్దు స్థానంలో భార్యను కాడికి కట్టి పొలం దున్నిన అన్నదాత!

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా, డియోని తాలూకా బంబాలి గ్రామంలో దేశాన్నే కదిలించే ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం, సాగు కోసం పడుతున్న అవస్థలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో అందర్నీ కలచివేస్తున్నాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పిడుగుపాటు కారణంగా, బంబాలి గ్రామానికి చెందిన పేద రైతు కాశీనాథ్ గైక్వాడ్‌కు చెందిన ఎద్దు మరణించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై, పొలం పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో జీవనాధారమైన ఎద్దు చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. మార్కెట్‌లో మరో ఎద్దును కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత ఆ పేద రైతుకు లేదు. అటు చూస్తే విత్తనాలు వేసే సమయం మించిపోతోంది.

చేసేదేమీ లేక, ఆ అన్నదాత తన నాగలికి ఒక వైపు ఎద్దును.. మరోవైపు తన భార్యనే కాడికి ఎద్దులా కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. భర్తతో పాటు ఆ ఇల్లాలు కూడా ఎద్దు స్థానంలో నిలబడి నాగలిని ముందుకు లాగుతూ పొలాన్ని దున్నుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసైనా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు,సంబంధిత మంత్రులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యానికి గురైన ఆ రైతు కుటుంబాన్ని ప్రత్యేక సందర్భం కింద పరిగణించి, ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం, కొత్త ఎద్దును అందజేసి ఆదుకోవాలని మానవతావాదులు కోరుతున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..