
- వర్షాలు పడుతున్న సమయంలో రోడ్లపై పనుల కోసం గుంతలు
- కాలనీల నుంచి మెయిన్ రోడ్ల వరకు తవ్వకాలు
- అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మొన్నటి ఒక్క వానకే నగరం ఆగమైంది. వర్షాకాల సన్నాహకాల పేరుతో నెల రోజులుగా సమీక్షలు చేసిన అధికారులు.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పినా.. తొలి వర్షానికే నగరం స్తంభించింది. రోడ్లు చెరువులను తలపించాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షాకాలం రాకముందే చెట్ల కొమ్మలు తొలగించాలని, ప్రమాదకర వృక్షాలను గుర్తించాలని నిర్ణయించినా.. చాలా ప్రాంతాల్లో ఆ పనులు జరగలేదు. ఫలితంగా ఒక్క గాలివానకు నగరవ్యాప్తంగా 300కు పైగా చెట్లు నేలకూలాయి.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా రోడ్లపై రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 899 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించిన అధికారులు.. ఎక్కడా నీరు నిల్వ ఉండదని ప్రకటించారు. కానీ, తొలి భారీ వర్షానికే ఆ హామీలు నీటిలో కలిసిపోయాయి.
గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, రాయదుర్గం, షేక్ పేట్, అంబర్‌పేట, మలక్‌పేట సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రధాన కూడళ్లన్నీ ట్రాఫిక్ జామ్ కు కేంద్రాలుగా మారాయి.
కొనసాగుతున్న పైప్‌లైన్ పనులు
మూడు కార్పొరేషన్ల పరిధిలో వానలు పడకముందే అనేక రోడ్లు దెబ్బతిని గుంతలమయంగా మారాయి. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనుల పేరుతో తవ్విన రహదారులు వర్షానికి మరింత దెబ్బతినడంతో వాహనదారులు, పాదచారులు నానా తంటాలు పడుతున్నారు.
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సంబంధిత శాఖలు కేబుల్ లైన్లు, ఫుట్‌పాత్ నిర్మాణాలు, జలమండలి పైప్‌లైన్ పనులను కొనసాగిస్తున్నాయి. కాలనీల్లోని అంతర్గత రోడ్ల నుంచి ప్రధాన రహదారుల వరకు ఎక్కడ చూసినా తవ్వకాలే కనిపిస్తున్నాయి. దీంతో రోడ్లు బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జ్‌లపై సీన్ రిపీట్
ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జ్‌లపై ఏర్పాటు చేసిన డ్రైనేజీ వెంట్స్‌ను సమయానికి శుభ్రం చేయకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లలేదు. దీంతో స్టీల్ బ్రిడ్జ్‌తో పాటు పలు ఫ్లైఓవర్లపై నీరు ఎప్పటిలాగే నిలిచిపోయింది. మరోవైపు గతేడాది భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు, పంపింగ్ వ్యవస్థల నిర్వహణ సరిగా లేకపోవడంతో వాటి ప్రయోజనం కనిపించలేదు. అండర్ పాస్ ల నుంచి ఫ్లైఓవర్ ల వరకు జలమయమయ్యాయి.
రోడ్లపై నిలిచిన నీరు చెరువులను తలపించడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనులను వేగంగా పూర్తి చేసి, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలని
కోరుతున్నారు.
అంతా హైడ్రా చూసుకుంటుందని..
వర్షాలు పడిన సమయంలో అంతా హైడ్రా చూసుకుంటుందని మూడు కార్పొరేషన్ల అధికారులు లైట్ తీసుకుంటున్నారు. కనీసం ఫీల్డ్ లో ఉండి కోర్డినేషన్ కూడా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వానలు పడే సమయంలో సమన్వయంతో పని చేయలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదని పలువురు అంటున్నారు.