
Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి టీమిండియా జెర్సీలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌తో 39 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2026 సమయంలో హ్యామ్ స్ట్రింగ్ గాయంతో బాధపడిన రోహిత్ కొద్దిరోజులు ఆటకు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందడంతో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్‌లో రోహిత్ రెండు అరుదైన రికార్డులపై కన్నేశాడు.
12,000 వన్డే పరుగుల మైలురాయికి చేరువ:
ప్రస్తుతం రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో 282 మ్యాచ్‌లలో 11,577 పరుగులు సాధించాడు. మరో 423 పరుగులు చేస్తే వన్డే చరిత్రలో 12,000 పరుగుల క్లబ్‌లో చేరిన ఆరో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే ఆ లిస్ట్ లో ఉన్న సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కించుకోనున్నాడు. అఫ్గానిస్థాన్ బౌలింగ్ దాడి ప్రధానంగా స్పిన్‌పై ఆధారపడటం, రోహిత్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్ కావడం అతడికి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.
1,100 ఫోర్ల క్లబ్‌లోకి:
రోహిత్ ఇప్పటికే వన్డేల్లో 1,089కి పైగా ఫోర్లు బాదాడు. 1,100 ఫోర్ల మైలురాయికి చేరుకోవాలంటే కేవలం 11 ఫోర్లు మాత్రమే అవసరం. అతడి క్లాసిక్ స్ట్రోక్‌ప్లే, బౌండరీలు సాధించే నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ ఘనతను తొలి మ్యాచ్‌లోనే అందుకునే అవకాశం ఉంది. జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు మొహాలీలో భారత జట్టు సాధన నిర్వహించింది. ఈ సెషన్‌లో అందరి దృష్టిని రోహిత్ శర్మ ఆకర్షించాడు.
మొదట ఫిట్‌నెస్ డ్రిల్స్‌లో పాల్గొన్న రోహిత్ ఎలాంటి అసౌకర్యం లేకుండా షటిల్ రన్స్ పూర్తి చేశాడు. అనంతరం బ్యాటింగ్ సాధన ప్రారంభించిన హిట్‌మ్యాన్ మొదట్లో కొంత తడబడ్డాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన బ్యాటర్‌లా టైమింగ్ కోసం ప్రయత్నించాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కొన్ని బంతులను వదిలేయడంతో పాటు, మరికొన్ని బంతులకు మిస్ అయ్యాడు.
అయితే కొద్దిసేపటికే రోహిత్ తన అసలైన లయను అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. గర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ వంటి పేసర్లను ఎదుర్కొంటూ తన షాట్లను మెరుగుపర్చుకున్నాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రం హిట్‌మ్యాన్ పూర్తి స్థాయిలో చెలరేగిపోయాడు. ఓ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు కొడుతూ తన క్లాస్‌ను మరోసారి చాటిచెప్పాడు. స్ట్రెయిట్ డ్రైవ్స్, లాంగ్ ఆన్ మీదుగా బాదిన భారీ షాట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. లక్నో, చెన్నై వంటి ఫ్లాట్ పిచ్‌లపై జరిగే ఈ సిరీస్‌లో రోహిత్ భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి హిట్ మ్యాన్ ఈ రికార్డ్స్ ను సాదిస్తాడో.. లేదో.?