Reading Time: 2 minutes

ప్రైమరీ స్కూళ్లలో ‘తొలిమెట్టు’ పక్కాగా అమలు.. 3 నుంచి 5 క్లాసుల పిల్లలకు ఏఐ పాఠాలు

Caption of Image.
  •     1 నుంచి 5వ తరగతి విద్యార్థులపై స్పెషల్ ఫోకస్
  •     3 నుంచి 5 క్లాసుల పిల్లలకు ఏఐ పాఠాలు
  •     మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు రెమెడియల్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైమరీ బడుల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థుల కోసం ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’(ఎఫ్ఎల్‌‌ఎన్) కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మార్గదర్శకాలు విడుదల చేశారు. గత నాలుగేండ్లుగా చేపట్టిన చర్యలతో జాతీయ స్థాయి సర్వేల్లో తెలంగాణ ర్యాంకు 36 నుంచి 26కు మెరుగుపడిందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ విద్యాసంవత్సరం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. 

వారానికి 80 నిమిషాల ఏఐ క్లాసులు..

విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీని చేరువ చేస్తూ 3వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు వారానికి 80 నిమిషాల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లెసెన్ సెషన్లు నిర్వహించనున్నారు. గణితం, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పిల్లల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టూల్స్ వాడనున్నారు. అలాగే, ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు లెర్నింగ్ ఎన్‌‌రిచ్‌‌మెంట్ పీరియడ్(రెమెడియల్ క్లాసెస్) పేరుతో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఏడాదిలో మూడుసార్లు (బేస్‌‌లైన్, మిడ్‌‌లైన్, ఎండ్‌‌లైన్) అంచనా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పురోగతిని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందో పర్యవేక్షించే బాధ్యతను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌‌ఎంలకు అప్పగించారు. ఎంఈఓలు నెలకు కనీసం 20 స్కూళ్లను, కాంప్లెక్స్ హెచ్‌‌ఎంలు 15 స్కూళ్లను సందర్శించి బోధనా పద్ధతులను పరిశీలించాలని అధికారులు సూచించారు. అలాగే, ప్రతిరోజూ తరగతి గదిలో 30 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించి, పిల్లలతో కథల పుస్తకాలు చదివించాలని అధికారులు స్పష్టం చేశారు. తరగతి గదిలో వెనుకబడిన పిల్లల కోసం టీచర్ సపోర్ట్ గ్రూప్, పీర్ సపోర్ట్ గ్రూపులను ఏర్పాటు చేసి అందరికీ కనీస సామర్థ్యాలు వచ్చేలా చూడాలని గైడ్‌‌లైన్స్‌‌లో పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.