Reading Time: 2 minutes
The Indian Train Offering Free Meals To Passengers For Nearly 30 Years

Free Food Train : రైలు ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవడం మాత్రమే కాదు. అది అనుభవాల సమాహారం. కిటికీ బయట మారిపోయే దృశ్యాలు, స్టేషన్ల సందడి, కొత్త ప్రయాణికులతో పరిచయాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. అయితే ఈ ప్రయాణంలో ఆకలి వేస్తే సాధారణంగా మనం స్టేషన్‌లో ఆహారం కొనుగోలు చేయడం లేదా వెంట తీసుకెళ్లిన పదార్థాలను తినడం చేస్తాం. కానీ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. ఇందులో ప్రయాణించే వారికి ప్రేమతో, సేవాభావంతో ఉచితంగా భోజనం అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సేవ దాదాపు మూడు దశాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతోంది. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఇంతలా ఆశ్చర్యపరసన్న ఆ రైలు సంగతి ఏమిటో ఓ సారి చూద్దాం.

ఆ రైలు పేరు సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వరకు సుమారు 2,000 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో మొత్తం 39 రైల్వే స్టేషన్లలో ఆగే ఈ రైలు, ఆరు ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత లంగర్ సేవలను అందిస్తుంది. సిక్కు మత సంప్రదాయంలో భాగమైన లంగర్ వ్యవస్థ ఆధారంగా ఈ సేవ కొనసాగుతోంది. ఇక్కడ ధనికుడు, పేదవాడు, యువకుడు, వృద్ధుడు అనే తేడా ఉండదు. మతం, కులం, ప్రాంతం అనే భేదాలు కూడా ఉండవు. రైలులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ సమానంగా భోజనం అందిస్తారు.

ఈ లంగర్ వెనుక ఉన్న అసలు బలం సేవాభావం. గురుద్వారాలు, భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొందరు బియ్యం, పప్పులు, ధాన్యాలను దానం చేస్తారు. మరికొందరు వంటలో సహాయం చేస్తారు. ఇంకొందరు ప్రయాణికులకు స్వయంగా ఆహారం వడ్డిస్తారు. కర్రీ రైస్, కిచిడీ, పప్పు, శనగల వంటి పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. ఈ ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, మానవత్వం ఇంకా జీవించి ఉందనే భావనను కూడా కలిగిస్తుంది. ఈ సేవకు అలవాటుపడిన చాలామంది ప్రయాణికులు తమ వెంట ప్రత్యేకంగా పాత్రలు కూడా తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వారికి ఈ లంగర్ ప్రసాదం అందుతుందని తెలుసు. వేగంగా మారుతున్న ఈ కాలంలో ప్రతి చిన్న సేవకూ లెక్క కడుతున్న సమయంలో, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వేలాది మందికి భోజనం అందించడం నిజంగా గొప్ప విషయం.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, మథుర, ఝాన్సీ, లలిత్‌పూర్ వంటి స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. దీంతో ఉత్తర భారతదేశం నుంచి ప్రయాణించే వారు కూడా ఈ సేవను అనుభవించే అవకాశం పొందుతున్నారు. ప్రయాణంలో నీళ్లు, భోజనం కోసం అధిక ధరలు చెల్లించాల్సిన రోజుల్లో సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ ఒక భిన్నమైన సందేశాన్ని ఇస్తోంది. సేవ, సోదరభావం, సమానత్వం అనే విలువలు ఇంకా సమాజంలో బలంగా ఉన్నాయని ఈ రైలు ప్రతిరోజూ నిరూపిస్తోంది. అందుకే సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, మానవత్వం పట్టాలపై పరుగెత్తుతున్న అరుదైన ఉదాహరణగా నిలిచింది.