Reading Time: 2 minutes

ఉద్యోగుల ప్రతి కమ్యూనికేషన్ ఏఐతో ట్రాక్ చేస్తున్న కాగ్నిజెంట్.. రూ.1900 కోట్ల బిజినెస్ సీక్రెట్!

Caption of Image.

మనం ఆఫీసులో కొలీగ్స్‌తో చాట్ చేస్తున్నప్పుడు, క్లయింట్లకు ఈమెయిల్స్ పంపుతున్నప్పుడు లేదా మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు.. అదంతా కేవలం పని కోసమే అనుకుంటాం. కానీ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ మాత్రం ఆ చాట్స్, ఈమెయిల్స్ వెనుక దాగున్న బిజినెస్ అవకాశాలను వెతికి పట్టుకుంటోంది. అవును ఉద్యోగుల రోజువారీ ఆన్‌లైన్ ఇంటిరాక్షన్స్, ఈమెయిల్స్, మీటింగ్స్ డేటాను AI ద్వారా అనలైజ్ చేసి.. కాగ్నిజెంట్ ఏకంగా రూ.1,900 కోట్ల సరికొత్త సేల్స్ పైప్‌లైన్‌ను సృష్టించింది.

కంపెనీ సీఈఓ రవికుమార్ ఈ సరికొత్త విషయాన్ని ఏఐ ఫోరమ్‌లో వెల్లడించారు. ఈ టెక్నాలజీని ‘కాంటెక్స్ట్ ఇంజనీరింగ్’ అని పిలుస్తున్నారు. సాధారణంగా సేల్స్ టీమ్స్‌కి దొరకని ఎన్నో వ్యాపార అవకాశాలు ఉద్యోగుల ఈమెయిల్స్, చాట్స్‌లో దాగి ఉంటాయట. వాటిని బయటకు తీయడమే ఈ సిస్టమ్ పని. ఈ ఏడాది చివరి నాటికి ఈ టెక్నాలజీ ద్వారా ఏకంగా రూ.9వేల 500 కోట్ల బిజినెస్ సృష్టించాలని కాగ్నిజెంట్ టార్గెట్‌గా పెట్టుకుంది.

ఇంతకీ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే.. కాగ్నిజెంట్ దీని కోసం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి కో-ఫౌండర్‌గా ఉన్న ‘వర్క్‌ఫ్యాబ్రిక్’ అనే స్టార్టప్‌తో జతకట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ సేల్స్, సపోర్ట్, డెలివరీ, ఫైనాన్స్ విభాగాల్లోని ఉద్యోగుల డేటాను పరిశీలించి, ప్రతి క్లయింట్ అకౌంట్‌కు ఒక డిజిటల్ ట్విన్ ను క్రియేట్ చేస్తుంది.

ఉదాహరణకు.. ఒక క్లయింట్ తన ఇంజనీరింగ్ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు, క్వాలిటీ అస్యూరెన్స్ బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఒక ఉద్యోగి చాట్‌లో లేదా ఈమెయిల్‌లో సిగ్నల్ దొరికితే.. వెంటనే ఈ ఏఐ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ‘సదరు క్లయింట్‌కు క్వాలిటీ అస్యూరెన్స్ ఆప్టిమైజేషన్ ప్లాన్‌ను ఆఫర్ చేయండి’ అని కాగ్నిజెంట్ సేల్స్ టీమ్‌కు అది ప్రోయాక్టివ్‌గా రికమండ్ చేస్తుంది. అలాగే ప్రాజెక్టుల్లో వచ్చే సమస్యలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది.

ALSO READ : PF అకౌంట్ ఉందా? ఇప్పుడే ఈ-నామినేషన్ చేయండి..

కేవలం సేల్స్ కోసమే కాదు.. ఆఫీసులో సరైన ఉద్యోగికి సరైన ప్రాజెక్ట్ కేటాయించడానికి కూడా కాగ్నిజెంట్ దీనిని వాడుతోంది. రెజ్యూమేలు, స్కిల్ డేటాబేస్‌లను నమ్ముకోకుండా.. ఒక ఉద్యోగి అసలు ఎలాంటి పనులు చేస్తున్నాడో వారి ఇంటరాక్షన్స్ ఆధారంగా గుర్తించి ప్రాజెక్టుల్లోకి తీసుకుంటున్నారట.

మొత్తానికి ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కేవలం కోడింగ్ రాసి పనులను ఆటోమేట్ చేసేవారు. ఏఐ యుగంలో కంపెనీలోని సమాచారాన్ని సరిగ్గా వాడుకుని నిర్ణయాలు తీసుకోవడమే ‘కాంటెక్స్ట్ ఇంజనీరింగ్’. మెటా లాంటి సంస్థలు కూడా ఉద్యోగుల మౌస్ మూవ్‌మెంట్స్, కీబోర్డ్ స్ట్రోక్స్‌ని ట్రాక్ చేస్తూ ఏఐ ఏజెంట్లను తయారు చేస్తున్న వేళ కాగ్నిజెంట్ వేసిన ముందడుగు ఐటీ రంగంలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది.

©️ VIL Media Pvt Ltd.