Reading Time: 2 minutes
PM Modi: 12 ఏళ్లలో స్పష్టమైన మార్పు చూపించాం.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తిగా ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఇది అత్యంత అద్భుతమైన క్షణమని మోదీ చెప్పుకొచ్చారు. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం లభించడం తన అదృష్టమని పేర్కొంటూ.. ఎన్డీఏ కూటమి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

పాలన – దేశాభివృద్ధి

అధికారాన్ని తాను ఒక సేవగా భావిస్తానని.. దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. తాము తీసుకొచ్చిన పథకాల వల్ల వచ్చిన మార్పులను చూసి గర్వపడుతున్నామని.. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. 2014కు ముందు దేశంలో అనేక సమస్యలు ఉండేవని.. ఆ తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత కృషి చేస్తామని ప్రధాని చెప్పారు.

డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ పాలసీలు ఉంటాయన్నారు. మేం కేవలం లెక్కలు మాత్రమే చెప్పడం లేదు.. వాటిని ఆచరణలో చూపిస్తున్నాం. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు

తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు సామాన్య ప్రజలు ఎంతో ఆనందించారని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడిందని.. గత 12 ఏళ్ల నుంచి దేశానికి కాంగ్రెస్ పీడ విరగడైందని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని.. అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో అటల్ బిహారీ వాజ్‌పేయ్ చూపించారని కొనియాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని.. ప్రస్తుతం ఎన్డీఏ పాలన అవినీతి రహితంగా సాగుతోందని మోదీ స్పష్టం చేశారు. గతంలో దశాబ్దాల కాలం పట్టిన అభివృద్ధి.. ఇప్పుడు కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోందని అన్నారు.

దేశ ప్రయోజనాలే ప్రథమం (నేషన్ ఫస్ట్)

తనకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యమని.. ‘నేషన్ ఫస్ట్’ నినాదంతో తాము పనిచేస్తున్నామని మోదీ చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, దేశ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడబోమని నిరూపించామన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని, దేశంలో మావోయిస్టులను అంతం చేశామని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు చట్టాన్ని తీసుకురావడంతో పాటు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చడానికి మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

భవిష్యత్తు లక్ష్యాలు

ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని.. 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించాల్సి ఉందన్నారు. అలాగే అణు ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తయారీ రంగంపై దృష్టి పెడితే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ఇతర విదేశాలపై ఆధారపడటం తగ్గించాలని.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీ చేపడుతూ ‘మేడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని సాకారం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత యుగం డేటా యుగమని.. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ‘డేటా సెంటర్ల హబ్’గా మారబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.