Reading Time: 2 minutes
Bharathiraja: ఏడాది క్రితమే ఏకైక కుమారుడి హఠాన్మరణం.. ఆ బాధతోనే బాగా కుంగిపోయిన భారతీరాజా

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, యాక్టర్ భారతీరాజా (84) ఇక లేరు. తెలుగు, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన బుధవారం (జూన్ 10) తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సమస్యలతో బాధపడుతోన్న ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు ఈ లెజెండరీ డైరెక్టర్ కు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అభిప్రాయపడుతున్నారు. కాగా సుమారు ఏడాది క్రితమే మార్చి 2025లో భారతీరాజా ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా (48) అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నటుడు, దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలోనే మనోజ్ కన్నుమూయడం భారతీరాజాను బాగా కృంగదీసిందని చెప్పవచ్చు. అప్పట్నుంచి ఆయన ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అప్పటివరకు వయసు పైబడినా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి అలరించిన ఆయన కొడుకు మరణంతో సినిమాలకు కూడ దూరమయ్యారు. చాలాసార్లు ఆస్పత్రి పాలయ్యారు.

కుమారుడి మరణాన్ని మర్చిపోవడానికి భారతీరాజా చాలా ప్రయత్నాలు చేశారు. కొంతకాలం విదేశాలకు వెళ్లి అక్కడ కుటుంబ సభ్యుల వద్ద గడిపారు. కొన్ని రోజుల క్రిమే చెన్నైకి తిరిగివచ్చారు. అయినా ఈ విషాదం నుంచి కోలుకోలేకపోయారీ లెజెండరీ డైరెక్టర్. ఇప్పడు ఆ బాధతోనే భారతీరాజా కన్నుమూశారని ఆయనకు తెలిసిన సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్నో ఏళ్ల పాటు కళామతల్లికి సేవలందించిన భారతీరాజా కన్నుమూయడం సినీ పరిశ్రమకు పెద్ద లోటే అని భావించవచ్చు.

లెజెండరీ డైరెక్టర్ కు అశ్రు నివాళులు..

భారతీరాజాకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.  ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారతీరాజా మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. ‘ప్రముఖ దర్శకులు  భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై  భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవి గారితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది…’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు.   భారతీరాజా గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి