
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. పాజిటీవ్ ఫీలింగ్ కలిగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సూపర్ మ్యూజిక్‌తో టీజర్ సాగింది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అనిపిస్తోంది.
సుమంత్ గారికి ఈ చిత్రంతో మరో బిగ్గెస్ట్ హిట్ రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న సుప్రియ యార్లగడ్డ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ‘ఇదొక డివోషనల్ థ్రిల్లర్. టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం, కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం’ అని చెప్పాడు. ఈ చిత్రంలోని స్ర్కీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుందని, క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పాడు.
ఈ చిత్రాన్ని వారాహి అమ్మవారు ముందుండి నడిపించారని నిర్మాత మధు అన్నారు. హీరోయిన్ మీనాక్షి గోస్వామి, రాజీవ్ కనకాల, అలీ, మంజు భార్గవి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.