
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయి.. పిల్లల ఆకలి తీర్చడం కోసం తల్లి తేలు తన ప్రాణాలను త్యాగం చేస్తుంది.. చిన్నప్పటి నుంచి మనం వింటున్న అత్యంత ప్రసిద్ధమైన ముచ్చట ఇదీ. సోషల్ మీడియాలో కూడా ఈ త్యాగానికి సంబంధించిన పోస్టులు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? సైన్స్ ఏం చెబుతోంది? జీవశాస్త్ర నిపుణుల పరిశోధనల్లో తేలిందేంటో చాలా మందికి తెలియదు. జీవశాస్త్ర నిపుణుల ప్రకారం.. తేలు పిల్లలు పుట్టగానే తల్లిని వేటాడి తినేస్తాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అది కేవలం ఒక పురాణం లేదా కల్పిత కథ మాత్రమే. అసలు నిజం ఏంటంటే.. చాలా మంది అనుకున్నట్లు తేళ్లు గుడ్లు పెట్టవు. అవి నేరుగా పిల్లలకే జన్మనిస్తాయి. ఈ ప్రత్యేకమైన ప్రక్రియను స్కార్పియోనింగ్ అంటారు. ఒక ఆడ తేలు తన గర్భ కాలం పూర్తయ్యాక ఒకేసారి 10 నుండి 100 వరకు పిల్లలకు జన్మనివ్వగలదు.
తల్లి వీపుపై పిల్లలు ఎందుకు ఉంటాయి?
తేలు పిల్లలు పుట్టినప్పుడు వాటి బాహ్య చర్మం చాలా మృదువుగా, తెల్లగా ఉంటుంది. ఆ సమయంలో వాటికి వేటాడే శక్తి గానీ, శత్రువుల నుండి తమను తాము రక్షించుకునే సామర్థ్యం గానీ ఉండదు. అందుకే పుట్టిన వెంటనే పిల్లలన్నీ తల్లి వీపుపై ఎక్కుతాయి. దాదాపు 10 నుండి 20 రోజుల పాటు ఆ పిల్లలు తల్లి వీపుపైనే నివసిస్తాయి. ఈ కాలంలో తల్లి తేలు అత్యంత క్రూరంగా మారి, తన పిల్లలను ఇతర జీవుల నుండి ప్రాణాలకు తెగించి కాపాడుతుంది. పిల్లల చర్మం గట్టిపడి, అవి సొంతంగా వేటాడగలిగే సామర్థ్యం వచ్చాక తల్లి వీపు పైనుంచి కిందకు దిగిపోతాయి. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ జర్నల్ ప్రకారం.. ఈ దశలో పిల్లలు తల్లిని వేటాడటం అనేది అసలు జరగనే జరగదు.
ట్విస్ట్ ఏంటంటే.. అసలు కథ రివర్స్
పిల్లలు తల్లిని తినడం పక్కన పెడితే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి తేలే తన సొంత పిల్లలను తింటుంది. దీన్నే సైన్స్ భాషలో కానిబలిజం అంటారు. ఆడ తేలుకు ఆహారం దొరకనప్పుడు లేదా ప్రసవం తర్వాత తీవ్రమైన నీరసానికి గురైనప్పుడు, అది తన పిల్లల్లోనే అత్యంత బలహీనంగా ఉన్న వాటిని వేటాడి తింటుంది. ఇలా చేయడం వల్ల తల్లికి తిరిగి శక్తి రావడమే కాకుండా మిగిలిన ఆరోగ్యకరమైన, బలమైన పిల్లలకు తల్లి రక్షణ లభించి బ్రతికే అవకాశం పెరుగుతుంది. ఇది ప్రకృతి నియమం.
మరి ఈ అపోహ ఎక్కడ నుండి వచ్చింది?
ప్రకృతిలో కొన్ని రకాల సాలీడులు, సూడోస్కార్పియన్లలో పిల్లలు తల్లిని తినే ప్రవర్తన కనిపిస్తుంది. కానీ ప్రజలు దాన్ని చూసి తేళ్లు కూడా అలాగే చేస్తాయని పొరబడ్డారు.