
ప్రముఖ రచయిత చేతన్ భగత్ నేటి మారుతున్న ప్రపంచంలో కెరీర్, సంబంధాలు, జీవితంలో విజయం సాధించడానికి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని పంచుకున్నారు. ఆయన ప్రకారం, ప్రస్తుత కాలంలో సింహంలా బలంగా ఉండటం కంటే బొద్దింకలా అడాప్టబిలిటీ అంటే పరిస్థితులకు అనుగుణంగా మారే గుణం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని వివరించారు. మారుతున్న టెక్నాలజీ, కెరీర్ సవాళ్లు, బంధాలలో వచ్చే మార్పులను తట్టుకుని నిలబడాలంటే పట్టువిడుపులు, ఫ్లెక్సిబిలిటీ, సహనం అత్యంత అవసరమని ఆయన వెల్లడించారు..
చేతన్ భగత్ ప్రకారం.. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం.. అత్యంత బలమైన జీవి లేదా అత్యంత తెలివైన జీవి మాత్రమే భూమిపై మనుగడ సాగించలేదు. కాలంతో పాటు వచ్చే మార్పులకు అనుగుణంగా త్వరగా మారే జీవి మాత్రమే బ్రతుకగలదు. చేతన్ భగత్ ఈ సూత్రాన్ని బొద్దింకల ఉదాహరణతో వివరించారు. భూమిపై ఎన్నో శతాబ్దాల క్రితం నివసించిన భారీ డైనోసార్ల వంటి బలమైన జీవులు ప్రకృతిలో వచ్చిన మార్పులను తట్టుకోలేక అంతరించిపోయాయి. కానీ, బొద్దింకలు మాత్రం తమ ఆకారాన్ని, అలవాట్లను మారుస్తూ కోట్లాది సంవత్సరాలుగా నేటికీ జీవిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా దూసుకుపోతోంది. నిన్న ఉన్న ఉద్యోగాలు ఈరోజు ఉండటం లేదు. ఇలాంటి సమయంలో.. నేను ఈ పని మాత్రమే చేస్తాను, నా పద్ధతి ఇంతే అని సింహంలా మొండిగా ఉంటే కెరీర్ పరంగా వెనుకబడిపోతారు. బొద్దింకలా ఏ వాతావరణానికైనా సర్దుకుపోయే గుణం అలవర్చుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడమే నిజమైన విజయం.
ఈ అడాప్టబిలిటీ కేవలం కెరీర్‌కే కాదు, వ్యక్తిగత జీవితానికి కూడా వర్తిస్తుంది. బంధాలు ముక్కలవడానికి ప్రధాన కారణం అహం (Ego). భాగస్వామితో మాట్లాడేటప్పుడు పట్టువిడుపులు ప్రదర్శించడం, అవతలి వారి పరిస్థితులను అర్థం చేసుకుని మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల బంధాలు కలకాలం నిలుస్తాయి. ఇక్కడ సింహంలాంటి అహంకారం కంటే, బొద్దింకలాంటి లొంగుబాటు తత్వమే కుటుంబాన్ని నిలబెడుతుంది.
చేతన్ భగత్ చెప్పిన ఈ సిద్ధాంతం ముఖ్య ఉద్దేశం.. సమాజంలో గౌరవాన్ని కోల్పోవాలని కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్‌గా ఉండటాన్ని నేర్చుకోవాలని. కాలంతో పాటు మారే మనస్తత్వం ఉన్నవారే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుని సుదీర్ఘకాలం నిలబడగలరు.