Reading Time: 2 minutes
Bengal School Cash Condoms Liquor Found Kanchrapara Harnett School Controversy

పశ్చిమ బెంగాల్‌లోని ఒక పాఠశాల అసాంఘిక శక్తులకు అడ్డగా మారింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉన్న ఓ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కోటి రూపాయల నగదు, కండోమ్స్, మద్యం బాటిల్ లభించడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనతో విద్యాసంస్థలో అసలు ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంచరపారా ప్రాంతంలోని హార్నెట్ స్కూల్ ఈ వివాదానికి కేంద్రంగా మారింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాఠశాల ఆవరణలోని ఒక గదిలో భారీ మొత్తంలో నగదు, కండోమ్స్, మద్యం బాటిల్ గుర్తించారు. ఆ గది సెమీ-ఫర్నిష్డ్‌గా ఉండటమే కాకుండా బెడ్‌రూమ్‌ను తలపించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ గదిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగించారనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పాఠశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యతను నిరాకరించింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో అలాంటి వస్తువులు ఉన్న విషయం తనకు తెలియదని, నగదు లేదా అభ్యంతరకర వస్తువులతో యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం అంతర్గత విచారణ ప్రారంభించింది. ఆ వస్తువులు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటన రాజకీయ దుమారం కూడా రేపింది. విద్యాసంస్థల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు పూర్తి విచారణ అనంతరం స్పందిస్తామని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థలకు సంబంధించిన అవకతవకలు, నియామక కుంభకోణాలు, యాజమాన్య లోపాలపై పలు వివాదాలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ వ్యవహారంపై అధికారులు త్వరలో అధికారిక తనిఖీలు నిర్వహించనున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సిబ్బంది ప్రవేశ రికార్డులు, పరిపాలనా పత్రాలను పరిశీలించి బాధ్యులను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు ఏదైనా నేర కార్యకలాపాలతో సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరిగినట్లు అధికారులు ధృవీకరించలేదు. అయితే ఈ ఘటన ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఇక ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ పశ్చిమ బెంగాల్‌కు శాపం… నాకు సిగ్గుగా ఉంది.’’ అని అన్నారు.