Reading Time: < 1 minute
Major Train Accident Averted Bhubaneswar Odisha Two Trains Same Track

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గురువారం భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. సిగ్నలింగ్ లోపమో లేదా మానవ తప్పిదమో తెలియదు కానీ, ఒకే రైల్వే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. భువనేశ్వర్‌లోని జార్పాడా వంతెన సమీపంలో జూన్ 11న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లోకో పైలట్లు, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో అప్రమత్తం కావడంతో ఒకే లైన్‌పై వస్తున్న ఆ రెండు రైళ్లు కొద్దిపాటి దూరంలోనే ఆగిపోయాయి. క్షణం ఆలస్యమైనా ఊహించని రీతిలో భారీ విపత్తు సంభవించి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు..
సాధారణంగా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. అయితే, ఈ ఘటనలో ఒక పెద్ద ఊరట లభించింది. ఎదురెదురుగా వచ్చిన ఆ రెండు రైళ్లు ప్రయాణికులతో వెళ్తున్నవి కావు. అవి కేవలం ఖాళీ బోగీలతో ప్రయాణిస్తున్న ‘ఎంప్టీ ట్రైన్ రేక్స్’ . ఒకవేళ అవి గనుక ప్యాసింజర్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అయి ఉంటే, ఈ పాటికి వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. రెండు రైళ్లలోనూ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు కాకుండానే ఈ గండం గడిచిపోయింది.

భయాందోళనలో స్థానికులు..
రెండు రైళ్లు ఎదురెదురుగా నిలిచి ఉండటాన్ని గమనించిన పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎలా వస్తాయంటూ రైల్వే నిర్వహణ తీరుపై మండిపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఈ అసాధారణ ఘటన కారణంగా ఆ మార్గంలో సాధారణ రైలు రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదని తూర్పు తీర రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అయితే, అసలు ఈ పొరపాటు ఎక్కడ జరిగింది? స్టేషన్ మాస్టర్ల మధ్య కమ్యూనికేషన్ లోపమా? లేక సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమా? అనే కోణంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.