Reading Time: 2 minutes

రినాల్ట్ EV కార్లను ఎందుకు ఎగబడి కొంటున్నారు.. నిన్నా మొన్నటి వరకు కొనే దిక్కు లేదు.. ఇప్పుడు ఇలా..!

Caption of Image.

ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల యూరప్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు  డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. నష్టాల్లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. 2025లో ఈవీల అమ్మకాలు 30 శాతం పెరిగిన, కంపెనీలు అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదు. కానీ, ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు $100 దాటిపోయింది. దీంతో ప్రజల ఆలోచన మారిపోయింది.

“ఇది తాత్కాలిక మార్పు కాదు, ఒక పెద్ద మలుపు” అని యూకేకు చెందిన ఆక్టోపస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈఓ గుర్జీత్ గ్రెవాల్ అన్నారు. ఏప్రిల్‌లో కొత్త ఈవీల డిమాండ్ 95 శాతం, పాత ఈవీల డిమాండ్ 160 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో యూరప్ అంతటా కొత్త ఈవీల రిజిస్ట్రేషన్లు 34 శాతం పెరిగాయి. ఈవీలు ఎక్కువగా వాడే డెన్మార్క్, నెదర్లాండ్స్‌లోనే కాకుండా, అమ్మకాలు తక్కువగా ఉండే ఇటలీ లాంటి దేశాల్లో కూడా డిమాండ్ పెరిగింది.

పెరిగిన కంపెనీల ఆర్డర్లు
చమురు ధరలు పెరగడంతో చిన్న సైజ్ ఈవీ మోడల్ కోసం ఆర్డర్లు బాగా వస్తున్నాయని, ముఖ్యంగా దక్షిణ యూరప్ దేశాల్లో కూడా ఈవీల గురించి జనాలు ఎక్కువగా అడుగుతున్నారని  వోల్వో సంస్థ తెలిపింది. ఏప్రిల్‌లో బ్రిటన్‌లో అమ్ముడైన కార్లలో సగానికి పైగా ఎలక్ట్రిక్ కార్లని.. యుద్ధం మొదలైనప్పటి నుండి ఈవీల గురించి ఆన్‌లైన్ ఎంక్వయిరీలు 48 శాతం పెరిగాయి అని రెనాల్ట్ సంస్థ చెప్పింది.

జర్మనీలో మాకు వచ్చిన ఆర్డర్లలో 60 శాతం ఈవీ కార్లని, మేము అనుకున్న 25 శాతం టార్గెట్ కంటే ఇది చాలా ఎక్కువని.. అందువల్ల ఈవీల ఉత్పత్తిని పెంచక తప్పడం లేదు అని కంపెనీ సీఈఓ మార్కస్ హాప్ట్ చెప్పారు.

ALSO READ : ఇథనాల్ బ్లెండింగ్‌పై మోడీ సర్కార్ యూటర్న్ తీసుకుంటోందా..?

చైనా ఈవీ బ్రాండ్ల హవా
తక్కువ ధరకే లభిస్తుండటంతో చైనా కంపెనీల కార్లకు ఆన్‌లైన్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. జర్మనీకి చెందిన ‘కార్‌వౌ’ (Carwow) వెబ్‌సైట్‌లో ఈవీల ఎంక్వయిరీల వాటా 40 శాతం నుండి 75 శాతానికి పెరిగింది. అదే సమయంలో సాధారణ పెట్రోల్ కార్ల వాటా 33 శాతం నుండి 16 శాతానికి పడిపోయింది.

చైనాకు చెందిన BYD కంపెనీ కార్ల కోసం ఆన్‌లైన్ ఎంక్వయిరీలు  మొదటి మూడు నెలల్లో ఏకంగా 25 వేల శాతం పెరిగాయి. లీప్‌మోటార్ (Leapmotor), ఎక్స్‌పెంగ్ (Xpeng) కంపెనీల కార్లకు కూడా డిమాండ్ పెరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘OLX’ వెబ్‌సైట్‌లో కూడా ఈవీల కోసం వెతికేవారి సంఖ్య 80 శాతం పెరిగింది.

 1970ల కాలంలో కూడా ఇంధన ధరలు పెరిగినప్పుడు జనాలు మైలేజ్ ఇచ్చే కార్లు కొని, ధరలు తగ్గగానే మళ్లీ పాత పద్ధతికి వచ్చేవారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. ఇరాన్ యుద్ధం వల్ల ప్రజలు  ఇంధన భద్రత గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. అందుకే యూరోపియన్లు ఎలక్ట్రిక్ కార్లను  ఎప్పుడో ఒకప్పుడు కొందాం అనే ఆలోచన పక్కన పెట్టి, ఇప్పుడే కొనేయాలి అనే నిర్ణయానికి వచ్చారు.

©️ VIL Media Pvt Ltd.