
- వారానికి ఒకరోజూ విధిగా జిల్లాల్లో పర్యటించాలె
- ప్రతి సోమవారం కమిషనర్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించేందుకు 16 మంది ఉన్నతాధికారులను ‘స్పెషల్ ఆఫీసర్లు’గా నియమించింది. ఈమేరకు పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పథకాల అమలులో పారదర్శకత పెంచడం, నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టినట్లు అధికారులు చెప్తున్నారు.
కాగా, స్పెషల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన జిల్లాల్లో వారానికి కనీసం ఒక్కసారి పర్యటించాల్సి ఉంటుంది. ప్రతి పర్యటనలో కనీసం రెండు గ్రామ పంచాయతీలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించాలి. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి.? నిధులు సక్రమంగా ఖర్చవుతున్నాయా.? లేదా? అనే అంశాలు పరిశీలించి, ప్రతి సోమవారం కమిషనర్‌కు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు, సిబ్బంది జీతాలు, పంచాయతీ సెక్రటరీల అటెండెన్స్, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణ తో పాటు చెత్త సేకరణ, కంపోస్ట్ షెడ్ల నిర్వహణ, సెగ్రిగేషన్ పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
దీంతోపాటు ఉపాధి హామీ పథకంలో ని మస్టర్ రోల్స్ తనిఖీ, పని ప్రదేశాల్లో వసతులు, మెటీరియల్ కాంపోనెంట్ పనుల పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి. సోషల్ ఆడిట్‌లో తేలిన అవకతవకలపై రికవరీ స్టేటస్, విజిలెన్స్ కేసుల పర్యవేక్షణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్పెషల్ అధికారులు వీరే..
స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులైన16 మంది అధికారులకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు జిల్లాల చొప్పున బాధ్యతలను అప్పగించారు. విద్యాలత (మహబూబాబాద్, వనపర్తి), కె. సుధాకర్ (మంచిర్యాల, నిర్మల్), పి.జె. వెస్లీ (ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం), కె. అనిల్ కుమార్ (జోగులాంబ గద్వాల్, కరీంనగర్), సురేష్ బాబు (జయశంకర్ భూపాలపల్లి, ములుగు), సరిత (జనగాం, యాదాద్రి భువనగిరి), శ్రీనాథ్ (వరంగల్, హన్మకొండ), శ్రీధర్ (నల్గొండ, కొమురం భీం ఆసిఫాబాద్), విజయరావు (జగిత్యాల, మెదక్), నర్సింహులు (సూర్యాపేట, ఆదిలాబాద్), ఉమారాణి (సంగారెడ్డి, సిద్దిపేట), శ్రీనివాస్ (పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల), కృష్ణన్ (మహబూబ్ నగర్, నారాయణపేట), నీరజ (రంగారెడ్డి, వికారాబాద్), సుబ్రహ్మణ్యం (నిజామాబాద్, కామారెడ్డి), శేషు కుమార్ (నాగర్ కర్నూల్) జిల్లా బాధ్యతలు అప్పగించారు.
ఏవైనా అత్యవసర సమస్యలు ఉంటే వెంటనే కమిషనర్ దృష్టికి తీసుకురావాలని, లక్ష్యాలను చేరుకోవడంలో జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు.