
హైదరాబాద్: ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి (RO) నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
మధ్యప్రదేశ్లోని మూడు రాజ్య సభ స్థానాలకు 2026, జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం రెండు స్థానాలను అధికార బీజేపీ సునాయాసంగా కైవసం చేసుకోనుండగా.. ఒక స్థానం కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఈ మూడో సీటు కోసం కాంగ్రెస్ తరుఫున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, హైదరాబాద్లో నమోదైన క్రిమినల్ కేసు వివరాలు, ఆస్తులు, బ్యాంక్ లావాదేవీల వివరాలను మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో దాచిపెట్టారని బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు.
►ALSO READ | ఒమన్ తీరంలో మరో వాణిజ్య నౌకపై మిస్సైల్ అటాక్.. ముగ్గురు భారతీయులు గల్లంతు
మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 10) కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ అంశంపై న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.