
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
కొండపాక, వెలుగు: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని పేరుపై ఉన్న ఎకరం 11 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన దండగుల ఎల్లయ్యకు నలుగురు కొడుకులు. ఇందులో ఇద్దరు చనిపోగా, మొదటి, నాల్గవ కొడుకుల పేర్లు దండగుల మల్లయ్య అలియాస్ వడ్డే మల్లయ్యనే. మొదటి కొడుకు గ్రామంలోనే ఉంటుండగా, నాల్గవ కొడుకు దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఉంటున్నాడు.
బందారం గ్రామంలోని సర్వే నంబర్ 382, 383, 384లో ఒక్కొక్కరికీ 1.10 ఎకరాల చొప్పున భూమి ఉంది. ఈక్రమంలో ఏడాది కింద మొదటి కొడుకు చనిపోయాడు. ఒకే పేరుతో ఇద్దరు అన్నదమ్ములు ఉండగా, నాల్గవ కొడుకు పేరుపై ఉన్న భూమిని కాజేయాలని మొదటి కొడుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు.
బతికి ఉన్న నాల్గవ కొడుకు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, 383 సర్వే నంబర్, ఖాతా నంబర్ 404లోని 1.10 ఎకరాల భూమిని పౌతి ద్వారా గత ఏడాది డిసెంబర్ లో మొదటి కొడుకు భార్య దండుగుల కనకవ్వ పేరుపై పట్టా మార్పించుకున్నారు. ఆ తరువాత ఆ భూమిని ఇతరులకు అమ్మేశారు.
విషయం ఆలస్యంగా తెలుసుకున్న నాల్గవ కొడుకు బతికి ఉన్న తనను చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి మోసం చేశారని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, అధికారులు తమను తిప్పించుకుంటున్నారని బాధితులు వాపోయారు.